Separate transfers in Serp సెర్ప్‌లో సెపరేట్ బదిలీలు
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:07 AM
Separate transfers in Serp సెర్ప్‌లో (వెలుగు)ఉద్యోగుల బదిలీలు భిన్నంగా జరిగాయి. ఊహించని ప్రాంతాలకు బదిలీ కావడంతో వారంతా అయోమయంలో పడ్డారు. మిగులు పోస్టులకు సర్దుబాటు పేరుతో దూర ప్రాంతాలకు స్థాన చలనం చేశారు
సెర్ప్‌లో సెపరేట్ బదిలీలు
మిగులు పోస్టుల పేరుతో దూర ప్రాంతాలకు పంపిన వైనం
నిబంధనలకు నీళ్లు
మహిళా ఉద్యోగులకు అన్యాయం
- డీఆర్‌డీఏలో డీపీఎంగా పనిచేస్తున్న ఓ మహిళా బదిలీ కోసం ఎటువంటి దరఖాస్తు చేసుకోలేదు. అయినా వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాల జిల్లాకు బదిలీ చేశారు. తనకు బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు.
- డీఆర్‌డీఏలో పనిచేసిన ఏపీఎంలను సాధారణంగా జోన్ పరిధిలోనే బదిలీ చేయాల్సి ఉంది. కానీ 8 మందిని జోన్ పరిధి దాటించారు. వీరిలో మహిళా ఉద్యోగులతో పాటు 50 సంవత్సరాలు పైడిన వారూ ఉన్నారు. అంత దూరం వెళ్లాలా? వద్దా ? అని తర్జనభర్జన పడుతున్నారు.
విజయనగరం కలెక్టరేట్, జూన్ 28(ఆంధ్రజ్యోతి):
సెర్ప్‌లో (వెలుగు)ఉద్యోగుల బదిలీలు భిన్నంగా జరిగాయి. ఊహించని ప్రాంతాలకు బదిలీ కావడంతో వారంతా అయోమయంలో పడ్డారు. మిగులు పోస్టులకు సర్దుబాటు పేరుతో దూర ప్రాంతాలకు స్థాన చలనం చేశారు. పొరుగు, పక్క జిల్లాలు అయితే పర్వాలేదు. మూడు, నాలుగు జిల్లాలు దాటించడంతో గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా మహిళా ఉద్యోగులను దూర ప్రాంతాలకు పంపడంతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ కాలం పనిచేసిన వారిని జిల్లాలో ఉంచి, బదిలీ కోసం కనీసం దరఖాస్తు చేసుకోలేని వారిని దూరం ప్రాంతాలకు పంపినట్లు ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
జిల్లాలోని వెలుగులో 11 మంది డీపీఎంలు, 53 మంది ఏపీఎంలు పనిచేస్తున్నారు. ఉండాల్సిన సిబ్బంది కంటే అధికంగా ఉన్నారని కొందరిని ఇతర జిల్లాలకు సర్దుబాటు చేశారు. అయితే ఈ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని సమాచారం. జీవో నెంబరు 23 ప్రకారం ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంది. అలాగే సొంత జిల్లా వారిని కూడా బదిలీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. డీపీఎంలకు వచ్చేసరికి ఐదేళ్లు దాటిన 8 మందిని బదిలీ చేయాల్సి ఉండగా ఇద్దరిని జిల్లాలోనే ఉంచారు. వారిద్దరికి ఐదేళ్లు దాటడమే కాకుండా సొంత జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఓ మహిళా డీపీఎంను వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాలకు బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆమె కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఏపీఎంలకు సంబంధించి జిల్లాలో 22 మంది గత నెలలో బదిలీ కౌన్సెలింగ్ కోసం విజయవాడలోని సెర్ప్ కార్యాలయానికి పంపించారు. వారిలో ఆరుగురు కౌన్సెలింగ్‌కు హాజరు కాకుండా తిరిగి జిల్లాకు వచ్చారు. వీరికి ఎక్కడ పోస్టులు చూపిస్తారు?అనేది తెలియాల్సి ఉంది. కౌన్సెలింగ్ హాజరైన 11 మందిలో 8 మందిని కోనసీమ, రాజమండి, కాకినాడ వంటి ప్రాంతాలకు బదిలీలు చేశారు. సాధారణంగా జోన్ పరిధిలో వీరిని బదిలీ చేయాల్సి ఉండగా జోన్ దాటించడంపై గగ్గోలు పెడుతున్నారు. మండల స్థాయిలో కీలక పోస్టుల్లో ఉన్న ఎంపీడీవో, తహసీల్దార్లను జిల్లాలోనే బదిలీ చేస్తుండగా ఏపీంఎలను జిల్లా దాటించడంపై పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులు క్రితం 11 మంది ఏపీఎంలు విజయవాడలోని సెర్ప్ సీఈవోని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. మహిళా ఉద్యోగులకు బదిలీల్లో తీవ్ర నష్టం జరిగిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇదే విషయాన్ని డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి వద్ద ప్రస్తావించగా నిబంధనల ప్రకారం జిల్లాలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన వారి పేర్లు పంపించామని, ఆయా మేరకు వారికి బదిలీలు ఉత్తర్వులు వచ్చాయని చెప్పారు.