Seeing the Goddess in a peaceful atmosphere ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:08 AM
Seeing the Goddess in a peaceful atmosphere పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి భక్తునికీ సులువుగా అమ్మవారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డితో కలిసి పైడితల్లి పండుగ, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శనివారం సమీక్షించారు.
ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం
ఉత్సవాలను విజయవంతం చేయాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత
విజయనగరం/టౌన్, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి):
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి భక్తునికీ సులువుగా అమ్మవారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డితో కలిసి పైడితల్లి పండుగ, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖ, రెవెన్యూ, దేవస్థానం వారు సంయుక్తంగా కంట్రోల్ రూం నుంచి అనుక్షణం పరిశీలిస్తుండాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, తాగునీటి సరఫరా బాగుండాలని, అంతా ప్లాస్టిక్ రహితంగా జరిగేలా చూడాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజయనగరం నగర పాలకసంస్థ కమిషనర్ పి.నల్లనయ్యకు సూచించారు. పండుగకు నలుమూలలనుంచి అధికంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని, అందుకు 170 బస్సులు అవసరమవుతాయని, ఆయా రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ రథాలను అనుసరించే వలంటీర్లకు, సేవా ప్రతినిధులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ దేవదాయ శాఖ మంత్రి అనం రాంనారాయణరెడ్డి 7వ తేదీ ఉదయం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని దేవదాయ శాఖను ఆదేశించారు. విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ 11 వేదికల్లో జరిగే కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, అదనపు ఎస్పీ సౌమ్యలత, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జిల్లా అధికారులు పాల్గొన్నారు