Suicide సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:04 PM
Secretariat Employee Commits Suicide గరుగుబిల్లి మండలం చిన్నగుడబ గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీర రాఘవ(26) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన అప్పుల బాధలు తాళలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
గరుగుబిల్లి/రామభద్రపురం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలం చిన్నగుడబ గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శీర రాఘవ(26) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన అప్పుల బాధలు తాళలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్థానికులు, రామభద్రపురం ఎస్‌ఐ వి.ప్రసాదరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రామభద్రపురం మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన రాఘవ తండ్రి ఈశ్వరరావు పాస్టర్. తల్లి అన్నపూర్ణ గృహిణి. తమ్ముడు రవి మండల రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. రాఘవ రెండు నెలల కిందట బదిలీపై చినగుడబ సచివాలయంలో విధుల్లో చేరారు. వల్లరిగుడబలో పంపిణీ చేసిన ఎరువులకు సంబంఽధించి రూ. 4.95 లక్షలు మార్క్ ఫెడ్‌కు చెల్లించలేదు. ఈ మొత్తం రాఘవ సొంతానికి వాడుకున్నారని తెలిసింది. మరోవైపు కొంత మంది రైతుల నుంచి అప్పుగా సుమారు రూ. 3.50 లక్షలు వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక కొద్దిరోజులుగా టెన్షన్ పడుతున్నారు. మరోవైపు అప్పు ఇచ్చిన వారి నుంచి కూడా ఒత్తిడి ఎక్కువైంది. ఈ బాధలకు తాళలేక శనివారం మధ్యాహ్నం స్వగ్రామంలోనే తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న రాఘవను కుటుంబ సభ్యులు హుటాహుటిన బాడంగి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రఽథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం నాటికి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.
ఆన్‌లైన్ బెట్టింగులే కారణమా?
గతంలో రాఘవ విజయనగరంలో విధులు నిర్వహించిన సమయంలో రెండు సార్లు సస్పెండ్‌కు గురైనట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఆ సమయంలో అధికంగా అప్పులపాలు కావడంతో ఆయన తండ్రి భూములు విక్రయించి చెల్లింపులు చేసినట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. కాగా రాఘవ మృతికి ఆన్‌లైన్ బెట్టింగులే కారణమని పలువురు చర్చించుకుం టున్నారు. దీనిపై ఏవోను జ్యోత్నను వివరణ కోరగా..‘ గత మూడు రోజులుగా రాఘవ ఫోన్ నెంబరుకు ఫోన్ చేస్తున్నా స్పందన లేదు.. ఈ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశాం. ’ అని తెలిపారు. దీనిపై జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ విమల మాట్లాడుతూ.. ఎరువుల పంపిణీకి సంబంధించి వీఏఏ రాఘవ సుమారు రూ. 4 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు.