Government Schools మరో ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో సీట్లకు సిఫారసులు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:49 AM
Seat Recommendations in Government Schools Within a Year ‘మరో ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో సీట్లకు సిఫారసు చేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ విద్యను ఇంకా ముందుకెళ్లడానికి కలిసికట్టుగా పనిచేద్దాం.’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి అచ్చెన్న
గిరిజన పాఠశాలలో చదివి ఈ స్థాయికి చేరా: మంత్రి సంధ్యారాణి
అభివృద్ధిలో వెనుకబడినా.. విద్యలో ముందున్నాం: ఎమ్మెల్యే బోనెల
పార్వతీపురం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ‘మరో ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో సీట్లకు సిఫారసు చేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ విద్యను ఇంకా ముందుకెళ్లడానికి కలిసికట్టుగా పనిచేద్దాం.’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. షైనింగ్‌స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ‘ఏపీలో చిట్టచివరి, అత్యంత వెనుకబడిన జిల్లా పార్వతీపురం మన్యం. ఎక్కువగా గిరిజనులు నివసించే ఈ జిల్లాలో షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమం నిర్వహించినందుకు మంత్రి లోకేశ్‌ను అభినందించాలి. గత పాలకులకు ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచన రాలేదు. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మన్యం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందని ఎవరూ ఊహించరు. విద్యతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని గుర్తించి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ఎన్నో సంస్కరణలు తెచ్చారు. కష్టమైన విద్యాశాఖను పట్టుబట్టి తీసుకున్నారు లోకేశ్. గత ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. ఎవరినీ సమస్యలను చెప్పకోనీయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఇచ్చారు. గత ఐదేళ్లలో పాలకుల తీరు వల్ల రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. వ్యవస్థలు కుప్పకూలాయి. అభివృద్ధి కుంటుపడింది. కష్టాలతో ప్రయాణం ప్రారంభించి ముందుకెళ్తున్నాం. సమస్యలపై స్పందించే మంత్రి దొరకడం అదృష్టం. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపని విధంగా విద్యార్థులకు మంచి యూనిఫారం డిజైన్ ఇచ్చారు. గత ఐదేళ్లలో దుర్మార్గ ప్రభుత్వం నాడు-నేడు పేరుతో రూ.4500 కోట్లు దుర్వినియోగం చేసింది. భవనాలు పాడు చేశారు. అసంపూర్తిగా వదిలేశారు. డబ్బు ఖర్చుపెట్టి స్కూళ్లు ఎత్తేశారు. అనాచిత నిర్ణయాలతో సమస్యలు వచ్చాయి.’ అని తెలిపారు.
గిరిజన స్కూల్‌లోనే చదివి ఈ స్థాయికి చేరా...
గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ .. ‘విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్న మంత్రి లోకేశ్ ఇక్కడకు రావడం మా అదృష్టం. టెన్త్, ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు. లోకేశ్ విద్యారంగంలో పెను మార్పులు తెచ్చారు. గతంలో సీఎం చంద్రబాబు ప్రతి గ్రామానికి స్కూల్, మండలానికో కాలేజ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. దివంగత నేత ఎన్టీఆర్ కారణంగా గురుకుల విద్యాలయాలు ఏర్పటయ్యాయి. ఆయన వల్లే మా విద్యార్థులు చదువు కొనసాగించగలుగుతున్నారు. అభివృద్ధిలో వెనుకపడ్డ జిల్లాలో మా విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. ఎనిమిది గిరిజన మండలాల్లో ఫోన్ సిగ్నల్స్ సరిగా రావడం లేదు. ఇంటర్నెట్ సమస్య లేకుండా చూడాలని కోరుతున్నా. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో కడుపు నింపిన ఘనత లోకేశ్‌దే. జోగింపేట స్కూల్‌లో ఇద్దరు ఐఐటీ, ముగ్గురు ఎన్‌ఐటీ సీట్లు సాధించారు. చదువుకుని ఏదైనా సాధించాలన్న పట్టుదల మా విద్యార్థులకు ఉంది. ప్రోత్సాహం ఇస్తే వారు ఉన్నత స్థానానికి చేరుతారు. నేను గిరిజన స్కూల్‌లో చదువుకొని ఈ స్థాయికి వచ్చా. ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లు తక్కువగా ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక బాలికల జూనియర్ కాలేజ్ ఇవ్వాలి.’ అని కోరారు.
అభివృద్ధిలో వెనుకబడ్డ విద్యలో ముందున్నాం....
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ .. ‘పార్వతీపురం జిల్లా ఒడిశాకు ముఖ ద్వారం. తెలుగు, ఒరియా సంస్కృతులు ఇక్కడ ఉంటాయి. అభివృద్ధిలో మేం వెనుకబడ్డాం. కానీ చదువులో వెనుకబడలేదు. టెన్త్‌లో గత మూడు సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన జిల్లాలను వెనక్కి నెట్టి ముందువరుసలో నిలిచాం. ఇక్కడ ఎక్కువ మంది ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల్లోనే చదువుతున్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నా జిల్లా మాది. ఐఐటీలో ఆ ప్రాంత విద్యార్థికి 15వ ర్యాంకు వచ్చింది. మంత్రి లోకేశ్ పర్యటనతో మాకు స్ఫూర్తినిచ్చారు. మీ అడుగు మా జిల్లా భవిష్యత్, జీవితాలను మార్చుతుందని నమ్ముతున్నాం. గతంలో టీడీపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకులాలను ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో మీ నేతృత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం ప్రజా ప్రతినిధులు సిఫారసు చేసే స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నా.’ అని తెలిపారు.
మంచి ఫలితాలు సాధించాం: కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ...‘ అత్యధికంగా గిరిజన మండలాలతో పూర్తిగా వెనుకబడిన మా జిల్లాలో టెన్త్, ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో కూడా మంచి ఫలితాలు వచ్చాయి. ఇందుకోసం కృషి చేసిన ఉపాధ్యాయ బృందాలకు అభినందనలు. మా ప్రాంతంలో సగం గిరిజన మండలాలు ఉన్నాయి. ఎక్కువ మంది ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతారు. లక్షలాది మంది విద్యార్థుల్లో 40 శాతం సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేమైన తర్ఫీదు ఇచ్చాం. ఆడపిల్లలు ఎనిమియాతో బాధపడుతున్నారు. వారికి భవిత కార్డు అందించాం. మెటా పీటీఎం సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించాం.’ అని తెలిపారు.