Pineapple సీజన్ ముగుస్తున్నా.. దక్కని ప్రతిఫలం
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:15 PM
Season Ends… But No Reward Yet సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులకు ప్రతిఫలం దక్కడం లేదు. సీజన్ ముగుస్తున్నా పైనాపిల్ ధర పెరగకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. వాస్తవంగా ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా వచ్చింది. అయితే ఆశించిన ధర మాత్రం రాలేదు. రోజు రోజుకూ ధర క్షిణీస్తుండడంతో గిరిజన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గిరిజన రైతుల గగ్గోలు
సీతంపేట రూరల్,జూలై 6(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో గిరిజన రైతులకు ప్రతిఫలం దక్కడం లేదు. సీజన్ ముగుస్తున్నా పైనాపిల్ ధర పెరగకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. వాస్తవంగా ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా వచ్చింది. అయితే ఆశించిన ధర మాత్రం రాలేదు. రోజు రోజుకూ ధర క్షిణీస్తుండడంతో గిరిజన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పంటను నిల్వచేసుకునే అవకాశం లేక పోవడంతో ఎంతో కొంత ధరకు వారపుసంతల్లో పంటను విక్రయిస్తున్నారు. గడిచిన ఆది, సోమవారాల్లో సీతంపేట వారపు సంతకు వచ్చిన పైనాపిల్ ధర రూ.8 ఉండగా.. ఈ వారం కాస్త పెరిగి రూ.10కు చేరింది. అంతకముందు వారం ఒక్కో పండును రూ.15 వరకూ విక్రయించేవారు. ప్రస్తుతం ధర భాగా తగ్గడంతో ఇదే అదునుగా మైదాన ప్రాంత వ్యాపారులు అధిక మొత్తంలో పైనాపిల్‌ను కొనుగోలు చేసి పట్టణాల్లో ఒక్కో పండును రూ.35 నుంచి 45కు విక్రయిస్తున్నారు. వ్యాపారులు, దళారులు లక్షల్లో సంపాదిస్తున్నా.. ప్రాంత గిరిజన రైతులు మాత్రం కనీస మద్దతు ధరకు నోచుకోవడం లేదు. ఈ ప్రాంతంలో పండే పైనాపిల్ పంటను నేరుగా రైతుబజార్లలో విక్రయించుకునేందుకు ఐటీడీఏ అధికారులు అవకాశం కల్పించారు. అయితే రవాణా ఖర్చులు భరించలేక గిరిజన రైతులు తక్కువ ధరకైనా వారపు సంతల్లోనే పంటను విక్రయిస్తున్నారు. కొండచీపుర్లు, ఇతరాత్ర సీజన్ పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.