Share News

But No Building! బడి ఉంది.. భవనమే లేదు!

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:14 PM

School Exists… But No Building! మార్కొండపుట్టి పంచాయతీ పరిధి కోదుపెద్దవలస గిరిజన గ్రామానికి పాఠశాల ఉంది కానీ.. భవనం లేదు. గత 40 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా.. భవన నిర్మాణం మాత్రం జరగడం లేదు. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. పూరిపాకలో నేలపై కూర్చొని చదువులు కొనసాగించాల్సి వస్తోంది. ఇక్కడ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు కూడా లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

 But No Building! బడి ఉంది.. భవనమే లేదు!
పాఠశాల కోసం గ్రామస్థులు నిర్మించిన పూరిపాక

  • సక్రమంగా నిధులు మంజూరు చేయని వైసీపీ ప్రభుత్వం

  • అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు

  • పూరిపాక, రేకుల షెడ్డులోనే గిరిజన విద్యార్థుల చదువులు

  • ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం

మక్కువ రూరల్‌, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): మార్కొండపుట్టి పంచాయతీ పరిధి కోదుపెద్దవలస గిరిజన గ్రామానికి పాఠశాల ఉంది కానీ.. భవనం లేదు. గత 40 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా.. భవన నిర్మాణం మాత్రం జరగడం లేదు. దీంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. పూరిపాకలో నేలపై కూర్చొని చదువులు కొనసాగించాల్సి వస్తోంది. ఇక్కడ పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు కూడా లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వాస్తవంగా ఈ పాఠశాలను ఇటీవల అప్పర్‌ నుంచి మోడల్‌ ప్రైమరీ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తుండగా.. మొత్తం 51 మంది గిరిజన విద్యార్థులున్నారు. అయితే ఈ పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాలేదు. రెండు గదుల నిర్మాణానికి 2023లో వైసీపీ సర్కారు నాడు-నేడు కింద రూ.37 లక్షలు మంజూరు చేసింది. అయితే విడతల వారీగా రూ.12 లక్షలే విడుదల చేసింది. దీంతో పునాదులు తవ్వకాలు, పిల్లర్ల నిర్మాణాలతో పనులు నిలిచిపోయాయి. పాఠశాలకు మంజూరైన నిర్వహణ నిధులతో మరోవైపు గ్రామస్థులు శ్రమదానం చేసి పూరిపాక, రేకుల షెడ్డు నిర్మించారు. ప్రస్తుతం 51మంది గిరిజన విద్యార్థులకు అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. వానొచ్చినా.. గాలులు వీచినా.. చదువులు సాగించలేని పరిస్థితి. మరోవైపు రేకుల షెడ్డు, పూరిపాక కూలిపోయే ప్రమాదం ఉండడంతో నిత్యం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు తాగునీటి సౌకర్యం లేదు. ఓ కేన్‌తో తెప్పిస్తున్న వాటర్‌నే విద్యార్థులు వాడుతున్నారు. వర్షం కురిస్తే.. పూరిపాకలోకి నీరు చేరడంతో వారు అర్ధాంతరంగా ఇళ్లకు వెళ్లిపోవాల్సి వస్తోంది. కాగా గ్రామం నుంచి స్కూల్‌కు రావడానికి సరైన మార్గం కూడా లేదు. గతంలో ఈ పాఠశాల విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినా.. శాశ్వత భవనం నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.

ఎంఈవో ఏమన్నారంటే..

నాడు-నేడు కింద 2023లో రూ.37లక్షలు మంజూరుచేశారు. అయితే విడతల వారీగా రూ. 12లక్షలు విడుదలయ్యాయి. వాటితో పునాదులు, కొంతవరకు పిల్లర్ల పనులు చేపట్టారు. ఆ తర్వాత నిధులు మంజూరుకాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కోదుపెద్దవలస పాఠశాల పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశాం.

- ఎం.శ్యామ్‌సుందరరావు, ఎంఈవో, మక్కువ

Updated Date - Aug 12 , 2025 | 11:14 PM