Share News

School Bag... Weight Reduced స్కూల్‌ బ్యాగు ... తగ్గింది బరువు

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:15 AM

School Bag... Weight Reduced విద్యార్థుల స్కూల్‌ బ్యాగు బరువు తగ్గింది. మోత బాధ తప్పింది. గతంలో బ్యాగు నిండా పుస్తకాలు ఉండేవి. దీంతో బ్యాగును మోసుకుంటూ పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడంతో పాటు విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలు అర్థం చేసుకోవడానికి సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టింది.

School Bag... Weight Reduced  స్కూల్‌ బ్యాగు ... తగ్గింది బరువు
విద్యార్థులకు అందించిన పుస్తకాలు

  • ముద్రణలో పలు మార్పులు

  • నాణ్యమైన విద్యకు సెమిస్టర్‌ విధానం

సాలూరురూరల్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల స్కూల్‌ బ్యాగు బరువు తగ్గింది. మోత బాధ తప్పింది. గతంలో బ్యాగు నిండా పుస్తకాలు ఉండేవి. దీంతో బ్యాగును మోసుకుంటూ పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించడంతో పాటు విద్యార్థులు సులభంగా పాఠ్యాంశాలు అర్థం చేసుకోవడానికి సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టింది. బోధనా కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందులో భాగంగా పుస్తకాల సంఖ్యను కుదించి విద్యార్థులకు బ్యాగు బరువు తగ్గించింది. పుస్తకాల ముద్రణలో కూడా పలు మార్పులు చేసింది. ఆకర్షణీయంగా, బరువు తక్కువగా ఉండేలా రూపొందించారు. ఏడాదికి రెండు సెమిస్టర్లగా పుస్తకాలను తయారు చేశారు. గతంలో 1,2 తరగతులకు తెలుగు, ఇంగ్లీషు, గణిత పాఠ్య పుస్తకాలు వేర్వేరుగా ఉండేవి. వర్క్‌బుక్‌లు సైతం వేర్వేరుగా ఉండేవి. దీంతో 1,2 తరగతుల విద్యార్థులు మొత్తం ఆరు పుస్తకాలు మోయాల్సి వచ్చేది. ప్రస్తుతం 1,2 తరగతులకు సెమిస్టర్‌కు రెండేసీ పుస్తకాలు మాత్రమే ఉండేటట్టు తయారు చేసి అందించారు. తెలుగు, ఆంగ్లం, గణితం కలిపి ఒకే పాఠ్యపుస్తంగా, ఇదే విధంగా మూడు కలిపి ఒకే వర్క్‌బుక్‌గా అందించారు. దీంతో విద్యార్థులు కేవలం రెండు పుస్తకాలు తీసుకుని వస్తున్నారు. 3 నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్‌ కలిపి ఒక పుస్తకంగా, పరిసరాల విజ్ఞానం కలిపి ఒక పుస్తకంగా రూపొందించారు. 6 నుంచి 9వ తరగతికి సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ కలిపి ఒక పుస్తకంగా తయారు చేశారు. జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం కలిపి ఒక పుస్తకంగా, భౌగోళిక, చరిత్ర, ఆర్థిక, పౌర శాస్త్రాలు కలిపి ఒక పుస్తకంగా అందించారు. పదో తరగతికి సెమిస్టర్‌ విధానంలో అందిస్తున్నారు. దీంతో విద్యార్థుల బ్యాగ్‌ బరువు తగ్గింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,503 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 90వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్‌ల ద్వారా 4,87,214 నోట్‌ పుస్తకాలు, 4,22,333 పాఠ్యపుస్తకాలు, 61,814 వర్క్‌బుక్‌లు, 89 వేల బ్యాగ్‌లు, 64 వేల బెల్ట్‌లు, బూట్లు అందించారు. యూనిఫాం ఇంకా రావాల్సి ఉంది. బ్యాగ్‌ బరువు తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:15 AM