Say No to Addiction మత్తుకు బానిస కావొద్దు
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:38 PM
Say No to Addiction మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కావొద్దని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ సోమవారం పార్వతీపురం చేరుకుంది.
బెలగాం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలకు ఎవరూ బానిస కావొద్దని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవ రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ సోమవారం పార్వతీపురం చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని చర్చి సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సా హపరిచారు. ముందుగా ఏఎస్పీ వెంకటేశ్వరరావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో...గంజాయి వద్దు.. జీవితం ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు పవార్ స్నప్నిల్ జగన్నాథ్, వైశాలి, ఏఎస్పీ మనీషా తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత జిల్లాయే లక్ష్యం
పార్వతీపురం టౌన్: డ్రగ్స్ రహిత జిల్లాయే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఎస్పీ మాధవరెడ్డి కోరారు. సైకిల్ ర్యాలీ అనంతరం పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలతో ఎవరూ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. దీనిపై ఇప్పటికే ‘సంకల్పం’ ద్వారా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థి దశలోనే ‘ఏది మంచి, ఏది చెడు’ అనేది గ్రహించాలన్నారు. యువత భవిష్యత్‌ను కాపాడేందుకు విద్యాసంస్థలను మత్తు రహిత ప్రాంతా లుగా మార్చడం ఎంతో అవసరమని వెల్లడించారు. గంజాయి, మాదకద్రవ్యాలు ఎవరు అమ్మినా, కోనుగోలు చేసినా.. వెంటనే 1972, 1100 లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు.