స్మార్ట్ మీటర్లతో విద్యుత్ పొదుపు
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:36 PM
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతోనే విద్యుత్‌ను పొదుపు చేయవచ్చునని ఏపీఈపీడీసీఎల్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.మల్లికార్జునరావు అన్నారు.
- త్వరలో గృహాలకు అమర్చుతాం
- ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ మల్లికార్జునరావు
పార్వతీపురంటౌన్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతోనే విద్యుత్‌ను పొదుపు చేయవచ్చునని ఏపీఈపీడీసీఎల్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.మల్లికార్జునరావు అన్నారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందుగా ప్రభుత్వ, వాణిజ్య కేంద్రాలతో పాటు పరిశ్రమల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ‘వినియోగదారుల్లో నెలకొన్న అపోహలను పోగొట్టేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇప్పటికే 13,229 స్మార్ట్ మీటర్లను బిగించాం. దశల వారిగా గృహాలకు కూడా అమర్చేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. పాతమీటర్ల కంటే స్మార్ట్ మీటర్లతో తక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. వాటిని ఏర్పాటు చేసే సమయంలో ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఆర్సీ) నిర్ణయించిన టారీఫ్ ప్రకారమే విద్యుత్ బిల్లులు వసూలు చేస్తాం. సందేహాల నివృత్తి కోసం వినియోగదారులు టోల్ ప్రీ నెంబరు 1912ను సంప్రదించవచ్చు.’ అని తెలిపారు. ఈ సమావేశంలో ఈఈ గోపాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.