Sara ఏజెన్సీలో సారా జోరు
ABN , Publish Date - Jun 21 , 2025 | 11:46 PM
Sara on a Roll at the Agency సీతంపేట ఏజెన్సీలో నాటుసారా ఏరులై పారుతోంది. అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అనేక గ్రామాల్లో బహిరంగంగానే క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. నాటుసారా తయారీ కేంద్రాలు చిన్నపాటి కుటీర పరిశ్రమలుగా మారాయి.
కుటీర పర్రిశమలను తలపిస్తున్న తయారీ కేంద్రాలు
యథేచ్ఛగా విక్రయాలు
రాత్రి వేళల్లో అక్రమ రవాణా
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్‌శాఖ
బలైపోతున్న గిరిజనులు
సీతంపేట రూరల్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో నాటుసారా ఏరులై పారుతోంది. అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అనేక గ్రామాల్లో బహిరంగంగానే క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. నాటుసారా తయారీ కేంద్రాలు చిన్నపాటి కుటీర పరిశ్రమలుగా మారాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం , గెడ్డలు, వాగులు నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలను వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుని బెల్లం ఊటలను తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్రమంగా సారాను జిల్లాలు దాటిస్తున్నారు. నెలలో ఏదో ఒకరోజు ఎక్సైజ్‌శాఖ దాడులు చేసి మమ అనిపించడం పరిపాటిగా మారింది. పూర్తిస్థాయిలో నిఘా కొరవడడంతో మన్యంలో సారా వ్యాపారం జోరుగా సాగుతోంది.
ఇదీ సంగతి..
- సారా వ్యాపారంలో పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ. కష్టం కూడా తక్కువగా ఉండడంతో ఈ వ్యాపారాన్నే అనేక మంది వృత్తిగా మలచుకుంటున్నారు. మొత్తంగా సీతంపేట ఏజెన్సీలో సారా వ్యాపారం మూడు పూలు.. ఆరుకాయలు అన్నచందంగా మారింది. మండల కేంద్రంలోనే యథేచ్ఛగా సారా విక్రయాలు జరుగుతున్నాయంటే.. ఇక మారుమూల గిరిజన గ్రామాల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
- ఏజెన్సీలో కొత్తకోట, జొనగనాయుడుగూడ, వలగజ్జిగూడ, చిన్నగోర, నెల్లిగండి, ఆనపకాయలగూడ, కోసంగి, నారాయణగూడ, చాపరాయిగూడ, మల్లమ్మతల్లిగూడ, చిన్నబగ్గ, దోనుబాయి, జొనగ, మండదీసరగూడ, వలగజ్జి, అమ్మచెరువు, బందమానుగూడ, బంగిగూడ, పెద్దగూడ, పనసగూడ, జరడకాలనీ, చినవంగర, ఓండ్రుజోల, కడగండివలస తదితర గ్రామాల పరిసరాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ గిరిజన గ్రామాల పరిసరాల్లోనే ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో మరింతంగా సారా తయారు చేస్తున్నారు.
బతుకులు ఛిద్రం
ఏజెన్సీలో ఆదివాసీలు, నాటుసారాకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. శుభకార్యాలు, పండుగుల సమయాల్లో ఎక్కువగా మద్యాన్ని వినియోగిస్తారు. గిరిజన ప్రాంతాల్లో నిత్యం లభించే నాటుసారాను కొందరు అవసరానికి మించి వినియోగిస్తున్నారు. మద్యం దూకాణాల్లో ఎక్కువ నగదు చెల్లించి కొనుగోలు చేయలేని మందుబాబులు తక్కువ ధరకు లభించే సారాకు అలవాటు పడుతున్నారు. దానికి బానిసలై బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. కాయ కష్టం చేసి సంపాదించిన మొత్తం సారాకు తగలేసి.. కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రి పాలవుతున్నారు. సారా తాగడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో పెద్దగా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. దీంతో గిరిజనుల్లో చైతన్యం కొరవడింది.
యథేచ్ఛగా ముడిసరుకుల విక్రయాలు
సారా తయారీకి వినియోగించే ముడిసరుకులు నల్లబెల్లం, పటిక, అమోనియా, నవాసారం వంటి వాటిని ఎక్కువగా సీతంపేటలో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు తమ గోడౌన్లలో నల్లబెల్లాన్ని నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళ్లల్లో క్వింటాళ్ల లెక్కన వాటిని వ్యాన్లలో లోడు చేసి సారా ప్రభావిత గ్రామాల్లోని వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు.
రాత్రి వేళల్లో రవాణా..?
ఏజెన్సీలో తయారు చేసే నాటుసారాను కొంతమంది వ్యాపారులు రాత్రి వేళల్లో ఆటోలు, బైక్‌ల ద్వారా మైదాన, పట్టణ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మన్యంలో సరిహద్దు గ్రామాలైన పొల్ల, చిన్నబగ్గ, కడగండి, ఓండ్రుజోల, వలగజ్జి గ్రామాల మీదుగా జనసంచారంలేని మార్గాల గుండా సారాను తరలిస్తున్నారు. హిరమండలం, వీరఘట్టం, పార్వతీపురం, పాలకొండ, రాజాం, కొత్తూరు, నివగాం, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట వంటి ప్రాంతాలకు ఇక్కడ నుంచి ప్లాస్టిక్ క్యాన్లలో సారాను రవాణా చేస్తున్నారు. దీనిపౌ ఎక్సైజ్‌శాఖ నిఘా కొరవడింది. దీంతో రోజుకు కొన్ని వేల లీటర్ల సారా తరలిపోతోంది.
ఎక్సైజ్ సీఐ ఏమన్నారంటే..
‘సీతంపేట ఏజెన్సీలో నాటుసారా ప్రభావిత గ్రామాలను ఇప్పటికే గుర్తించాం. 13 గ్రామాలను ఏ,బీ,సీలుగా విభజించాం. సారా రహిత గ్రామాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నవోదయం 2.0లో భాగంగా ఆయా ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కొందరిపై బైండోవర్ కేసులు కూడా నమోదు చేశాం. సాయంత్రం వేళల్లో సిబ్బందితో పెట్రోలింగ్ చేపడుతున్నాం. గట్టి నిఘా పెట్టాం. సారా నిర్మూలనకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాం.’ అని పాలకొండ ఎక్సైజ్ సీఐ సూర్యకుమారి తెలిపారు.