పారిశుధ్య కార్మికుల సమ్మెబాట
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:49 AM
గత రెండు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో పంచాయతీల్లో చెత్త పేరుకుపోతుంది.
- పంచాయతీల్లో పేరుకుపోతున్న చెత్త
గజపతినగరం,నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): గత రెండు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో పంచాయతీల్లో చెత్త పేరుకుపోతుంది. గజపతినగరం, పురిటి పెంట గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహి స్తున్న పారిశుధ్య కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో సీఐటీయూ ఆధ్వర్యంలో వారు సమ్మె చేస్తున్నారు. రెండు రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో పారిశుధ్య పనులు జరగడం లేదు. దీంతో పలు రోడ్లపై చెత్త నిల్వలు పేరుకుపోయాయి. డ్రైనేజీలు మురుగుతో నిండిపోతున్నాయి. దోమలు స్వైర విహరం చేస్తుండడంతో ఎటువంటి రోగాలబారిన పడాల్సి వస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ పాలకులు, అధికారు లు స్పందించి పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్క రించాలని రెండు పంచాయతీల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఈవోపీఆర్‌డీ జనార్దనరావును వివరణ కోరగా.. జీతాలకు సంబంధించి బిల్లు పెట్టామని, సోమవారం నుంచి విధులకు హాజరుకావాలని కార్మికులకు సూచించామని తెలిపారు.