Share News

Sanctions Still Pending..! వాటికి మంజూరు కాలే..!

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:28 AM

Sanctions Still Pending..! పన్నుల వసూలు లక్ష్యాలు చేరుకోవడంలో పాలకొండ నగర పంచాయతీ, సాలూరు పురపాలక సంఘం వెనుకబడ్డాయి. పార్వతీపురం మునిసిపాలిటీ మాత్రం ముందంజలో ఉంది. దీంతో పార్వతీపురం మినహా మిగతా రెండింటికి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు.

Sanctions Still Pending..! వాటికి మంజూరు కాలే..!
సాలూరు మునిసిపల్‌ కార్యాలయం

  • పాలకొండ, సాలూరుకు కేటాయించని వైనం

  • పన్ను వసూళ్ల లక్ష్యాలు చేరుకోకపోవడమే కారణం

  • అధికారుల తీరుపై విమర్శల వెల్లువ

పార్వతీపురం, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): పన్నుల వసూలు లక్ష్యాలు చేరుకోవడంలో పాలకొండ నగర పంచాయతీ, సాలూరు పురపాలక సంఘం వెనుకబడ్డాయి. పార్వతీపురం మునిసిపాలిటీ మాత్రం ముందంజలో ఉంది. దీంతో పార్వతీపురం మినహా మిగతా రెండింటికి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు. కాగా పాలకొండ, సాలూరు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు మంజూరు కాకపోవడానికి వారి నిర్లక్ష్యమే కారణమన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ఆయా ప్రాంత వాసులు కోరుతున్నారు.

పార్వతీపురానికి రూ.1.87 కోట్లు

పన్నులు పూర్తిస్థాయిలో వసూలు చేయడంతో జిల్లాకేంద్రం పార్వతీపురం పురపాలక సంఘానికి రూ.1.87 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఈ మొత్తంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రధానంగా 30 వార్డుల్లో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై పాలకవర్గాలు, అధికారులు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ముందుగా వివిధ వార్డుల్లో సీసీ రహదారులు, కాలువలను నిర్మించాలి. అదేవిధంగా ప్రధాన రహదారిలో వర్షం, మురుగునీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలి. తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉంది. శివారు ప్రాంతవాసులకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులు, పాలకవర్గంపై ఉంది.

సాలూరులో ఇలా..

జిల్లాలో సాలూరు పురపాలక సంఘం రూటే వేరు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కూడా సకాలంలో ఇక్కడ ఖర్చు చేయడం లేదు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వార్డుల్లో సమస్యలేవీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. పారిశుధ్యం, తాగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడే చెత్తకుప్పలు దర్శనమిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అభివృద్ధి పనుల సంగతి సరేసరి. పాలకవర్గం, అధికారులు ఎవరికి వారే అన్నట్టుగా తయారవడంతో మునిసిపాలిటీ పాలన గాడి తప్పింది. పన్నుల వసూళ్లలోనూ ఈ ప్రభావం పడింది. ఫలితంగా 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు. ఇకపోతే పట్టణ అభివృద్ధి విషయంలో వైసీపీ పాలకవర్గం సహకరించడం లేదనే విమర్శలున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్లు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రస్తుతం మునిసిపాలిటీలో ఎవరు ఏ విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. సాలూరు మునిసిపాలిటీకి ఆదాయం తీసుకొచ్చే విషయంలో రెవెన్యూశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూలు లక్ష్యాలు చేరుకోలేకపోయారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా కొన్నిశాఖల అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం.. మునిసిపాలిటీ అభివృద్ధికి శాపంగా మారింది.

పాలకొండ పరిస్థితి ఇదీ..

పాలకొండ నగర పంచాయతీకి సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.94 కోట్ల మేర పన్నులు వసూలు కావల్సి ఉంది. అయితే కేవలం రూ.94 లక్షలే వసూలు చేశారు. రెవెన్యూ వసూలు లక్ష్యంలో కనీసం 50 శాతం కూడా చేరుకోలేకపోవడంతో పాలకొండకు కూడా 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిధులు మం జూరైన జాబితాలో పాలకొండకు స్థానం లేకుండాపోయింది.

లక్ష్యాలు చేరుకుంటారా?

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాలకొండ, సాలూరులో అధికారులు శతశాతం పన్ను లక్ష్యాలు చేరుకోగలరా? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి.. పన్నుల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాల్సి ఉంది.. అధికారులను పరుగులు పెట్టించి లక్ష్యాలు చేరుకునేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.

అధికారులు ఏమన్నారంటే..

- ‘పాలకొండ నగరపంచాయతీకి సంబంధించి రెవెన్యూ వసూలు విషయంలో లక్ష్యాలు చేరుకోలేకపోయాం. అందుకే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు.’ అని ఆర్‌ఐ ఇంద్రమోహన్‌ తెలిపారు.

- ‘సాలూరు పురపాలక సంఘంలో గత ఏడాది ఇంటి పన్ను వసూళ్లలో లక్ష్యాలు చేరు కునేందుకు ప్రయత్నించాం. అయితే రూ.10 నుంచి రూ.15 లక్షలు తక్కువగా వసూలు కావ డంతో 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు. బకాయిలన్నీ పూర్తిస్థాయిలో వసూలైన తర్వాత ఆ నిధులు మంజూరవుతాయి.’ అని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు సాలూరు మున్సిపల్‌ కమిషనర్‌ రత్నకుమార్‌ తెలిపారు.

Updated Date - Oct 17 , 2025 | 12:28 AM