Sanctioned: 1872.. Utilized: 846 మంజూరు 1872.. వినియోగం 846
ABN , Publish Date - May 11 , 2025 | 11:00 PM
Sanctioned: 1872.. Utilized: 846 ఉమ్మడి జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో బంకర్ బెడ్లు తుప్పు పట్టిపోతున్నాయ్. వివిధ కారణాలతో చాలాచోట్ల అవి వినియోగానికి నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు
వాటి నిర్వహణ, మరమ్మతులను గాలికొదిలేసిన వైసీపీ సర్కారు
తుప్పుపట్టిపోతున్న వైనం
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలని విన్నపం
జియ్యమ్మవలస, మే 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో బంకర్ బెడ్లు తుప్పు పట్టిపోతున్నాయ్. వివిధ కారణాలతో చాలాచోట్ల అవి వినియోగానికి నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవంగా వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో చదువుతున్న వారి కోసం కోసం గత టీడీపీ ప్రభుత్వం బంకర్ బెడ్లు (ఒక దానిపై ఒకటి అమర్చబడిన మంచాలు) అందించింది. ప్రతి విద్యార్థి కచ్చితంగా మంచంపైనే పడుకునేలా చర్యలు తీసుకుంది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించలేదు. మంచాల మరమ్మతులు, నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో అనేకచోట్ల బెడ్లు మూలకు చేరాయి. కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన బంకర్ బెడ్లు నిరుపయోగంగా మారగా.. లక్ష్యం నీరుగారుతోంది. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 37 ప్రీ మెట్రిక్, 15 పోస్ట్ మెట్రిక్ బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. పోస్టు మెట్రిక్ పరిస్థితి పక్కన పెడితే ప్రీ మెట్రిక్‌లో బాలుర వసతి గృహాలు 28 ఉండగా, బాలికలవి ఎనిమిది, ఒక ఇంటిగ్రేటెడ్ బీసీ హాస్టల్ ఉంది. ఇందులో చదువుతున్న విద్యార్థుల కోసం 2019లో 1872 బంకర్ బెడ్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతగా 2019, జనవరి 16న బాడంగి, దత్తిరాజేరు, మొరకముడిదాం, బొబ్బిలిలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాలకు, బొబ్బిలి బాలికల వసతి గృహానికి బంకర్ బెడ్లు మంజూరయ్యాయి. ఆ తరువాత 23 బాలుర, ఏడు బాలికల వసతి గృహాలకు, ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు ఈ బెడ్లు ఇచ్చారు. బొబ్బిలి మండలం కలవరాయి బీసీ వసతి గృహానికి మాత్రం బంకర్ బెడ్లు మంజూరు కాలేదు. అయితే అత్యధికంగా నెల్లిమర్ల మండలం అలుగోలు బీసీ వసతి గృహానికి 125, అతి తక్కువగా నెల్లిమర్ల మండలం మొయిద బీసీ వసతి గృహానికి 37 బెడ్లు మంజూరయ్యాయి. నెల్లిమర్ల మండలం బొప్పడాం, గజపతినగరం బీసీ వసతి గృహానికి చెరో 60 చొప్పున బెడ్లు పంపిణీ చేశారు. విజయనగరం మండలం జొన్నవలస బీసీ హాస్టల్‌కు 40 బెడ్లు మంజూరు కాగా, మిగిలిన అన్ని వసతి గృహాలకు 50 చొప్పున అందించారు.
1026 బెడ్లు నిరుపయోగంగా..
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 37 బీసీ వసతి గృహాలకు 2019లో 1872 బంకర్ బెడ్లు మంజూరైతే కేవలం 846 మాత్రమే వినియోగిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 1026 బెడ్లు నిరుపయోగంగానే పడి ఉన్నాయి.
- నెల్లిమర్ల మండలంలోని మొయిదలో 37, అదే మండలం బొప్పడాంలో 60 బెడ్లు, చీపురుపల్లి బీసీ వసతి గృహంలో 50 బెడ్లను పూర్తిస్థాయిలో వాడుతున్నారు.
- బొబ్బిలి బాలుర గృహానికి ఇచ్చిన 50 బంకర్ బెడ్లలో పూర్తిగా విద్యార్థులు లేరు. వాటిని ఒక గదిలో ఉంచేశారు. మొరకముడిదాం బీసీ వసతి గృహానికి మంజూరు చేసిన 50 బెడ్లను కేజీబీవీకి ఇచ్చేశారు. కానీ అక్కడా వాడుకలో లేని పరిస్థితి.
- పార్వతీపురం బీసీ బాలుర వసతి గృహానికి ఇచ్చిన 50 బెడ్లు మూలన పడి ఉన్నాయి. పాచిపెంట బాలుర వసతి గృహం, కొమరాడ బాలికల వసతి గృహాలకు ఇచ్చిన బెడ్లు కూడా నిరుపయోగంగా మారాయి.
- చీపురుపల్లి బాలికల వసతి గృహానికి ఇచ్చిన 50 బెడ్లులో పది మాత్రమే వినియోగించారు. 20 గరివిడి కాలేజ్ బాలుర హాస్టల్‌కు, మరో 20 చీపురుపల్లి కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌కు పంపిణీ చేశారు. గుర్ల మండలంలోని కలవచెర్ల బాలుర వసతి గృహానికి ఇచ్చిన 50 బెడ్లులో 26 మాత్రమే ఉపయోగించారు. మిగిలిన 24 బెడ్లు కూడా గరివిడి కాలేజ్ బాలుర వసతి గృహానికి అందించారు.
కాలేజీ వసతిగృహాల్లో ఇలా..
ఉమ్మడి జిల్లాలోని 15 బాలుర, బాలికల కాలేజీ వసతి గృహాలు ఎక్కువగా అద్దె భవనాల్లోనే ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేని ఈ వసతి గృహాల్లో వారంతా నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి . తక్షణమే వసతి గృహాలు నిర్మించడంతో పాటు బంక ర్ బెడ్లు మంజూరు చేయాలని విద్యార్థుల తలిదండ్రులు కోరుతున్నారు.
వాడుకలోకి తెస్తాం
వసతిగృహాల్లో బంకర్ బెడ్లును పరిశీలిస్తాం. వాటిని 2025-26 విద్యా సంవత్సరం నుంచి పూర్తి వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం.
వై.జ్యోతిశ్రీ, డీబీసీడబ్ల్యూవో