Share News

Same thing again మళ్లీ అదే మాట

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:11 AM

Same thing again పైడిమాంబ ఆలయ విస్తరణ పనులు తరచూ వాయిదా పడుతున్నాయి. సంవత్సరాలుగా ఎందుకో జాప్యం జరుగుతోంది. అధికారులు ఈ విషయంలో ఎందుకో స్పష్టతకు రాలేకపోతున్నారు. ఎప్పటిలా అమ్మవారి పండుగ తరువాతే పైడిమాంబ ఆలయ విస్తరణ ప్రక్రియ చేపడ్తామని తాజాగా చెప్పుకొస్తున్నారు.

Same thing again మళ్లీ అదే మాట
పైడిమాంబ దేవస్థానం

మళ్లీ అదే మాట

పైడిమాంబ ఆలయ విస్తరణ పండుగ తరువాతేనట

చెప్పుకొస్తున్న అధికారులు

కీలకమైన ధర్మకర్తల మండలి నియామకం ఎప్పుడో

విజయనగరం రూరల్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పైడిమాంబ ఆలయ విస్తరణ పనులు తరచూ వాయిదా పడుతున్నాయి. సంవత్సరాలుగా ఎందుకో జాప్యం జరుగుతోంది. అధికారులు ఈ విషయంలో ఎందుకో స్పష్టతకు రాలేకపోతున్నారు. ఎప్పటిలా అమ్మవారి పండుగ తరువాతే పైడిమాంబ ఆలయ విస్తరణ ప్రక్రియ చేపడ్తామని తాజాగా చెప్పుకొస్తున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాఽధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడిమాంబకు నానాటికీ భక్తులు విశేషంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో చదురుగుడి (మూడులాంతర్లు)ని విస్తరించాలని రెండేళ్ల కిందట ధర్మకర్తల మండలి ప్రకటించింది. ఆ తర్వాత నిర్మాణ పనుల కోసం ఆలయానికి ఇరువైపులా స్థల సేకరణ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు రెండేళ్లు అవుతోంది. సేకరించిన స్థలంలో ఇప్పటివరకూ పనులు ప్రారంభించలేదు. పండుగ తేదీలు ప్రకటించే ముందు అధికారులు, అర్చకులు పండుగ అయిన తరువాత తప్పనిసరిగా ఆలయ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. పండుగ పూర్తయి, తిరిగి పండుగ తేదీలు ప్రకటించేంత వరకూ వాటి జోలికి వెళ్లడం లేదు. గత ఏడాది కూడా విస్తరణ పనులు పండుగ పూర్తయిన తరువాత చేస్తామని అధికారులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈనెల 13న ఆలయ ఈవో శీరిష, దేవదాయశాఖాధికారులు, అర్చకులు పండుగ తేదీలను ప్రకటించారు. విస్తరణ ఊసే లేదు. సెప్టెంబరు 12 నుంచి పైడిమాంబ సిరిమానోత్సవ ప్రక్రియ ప్రారంభమై, అక్టోబరు 22 వరకూ కొనసాగుతుంది. అక్టోబరు 22 తరువాత ఈ ఏదాది విస్తరణ ఉంటుందని అలయ అధికారులు మనసులోని మాట మరోసారి చెప్పారు. దశాబ్దకాలంగా పైడిమాంబ ఆలయానికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఆదాయం కూడా పెరిగింది. ఏడాదికి రూ.5 కోట్ల వరకూ (సిరిమానోత్సవంతో కలుపుకుని) వస్తోంది. ఈ నేపథ్యంలో పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరించాలని, తద్వారా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు ప్రకటిస్తున్నారు కానీ ఆచరణ లేదు.

- ఈసారైనా అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబరు 23 తరువాత ముహూర్తం చూసుకుని చదురుగుడిని విస్తరించనున్నారు. తొలుత రూ.2 కోట్లతో పనులు చేపడతారు. ఆ తరువాత ఆలయ సమగ్రాభివృద్ధికి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం మూడు, నాలుగు విధాలుగా ప్లాన్‌లు సిద్ధం చేశారు. వీటిలో ఏ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టినా రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకూ అయ్యే అవకాశం ఉంది.

ధర్మకర్తల మండలి లేనట్టేనా!

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలకు ధర్మకర్తల మండలి నియామకం కోసం దేవదాయశాఖ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. విజయనగరం జిల్లాలోని ఐదు ప్రముఖ ఆలయాలకు ధర్మకర్తల మండలి ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చినా విజయనగరం పైడిమాంబ దేవస్థానానికి ధర్మకర్తల మండలి గురించి ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. గత ఏడాది ఇదిగో ధర్మకర్తల మండలి.. అదిగో ధర్మకర్తల మండలి అంటూ ప్రచారం చేశారు. కనీసం ఉత్సవ కమిటీని కూడా నియమించని పరిస్థితి. ఈ ఏడాది సెప్టెంబరు 12 నుంచి పైడిమాంబ సిరిమానోత్సవ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంలో ధర్మకర్తల మండలి చాలా అవసరం. కానీ ప్రభుత్వం ఏ ప్రకటనా చేయలేదు.

- పైడిమాంబ ధర్మకర్తల మండలిలో 11 నుంచి 13 మంది వరకూ ఉంటారు. ధర్మకర్తల మండలిలో స్థానం కోసం ఇప్పటికే చాలా మంది తెలుగుతమ్ముళ్లు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు లేఖల ద్వారా విన్నవించుకున్నారు. ఆమె ఎవరికీ ఎటువంటి హామీ ఇవ్వకుండా మౌనంగా దరఖాస్తులు తీసుకున్నారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుపై దేవస్థానం అధికారులు, అర్చకులు, పైడిమాంబ భక్తులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

Updated Date - Aug 15 , 2025 | 12:11 AM