‘తల్లికి వందనం’ ప్రారంభం
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:23 PM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని గురువారం ప్రారంభించింది.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా
- జిల్లాలో 1,08,951 మందికి లబ్ధి
పార్వతీపురం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని గురువారం ప్రారంభించింది. అర్హులైన విద్యార్థులందరికీ ఏడాదికి రూ.15 వేలు అందించే విధంగా పథకాన్ని రూపొందించింది. ఇందులో రూ.2 వేలు పాఠశాల మెయింటినెన్స్‌కు మినహాయించి మిగిలిన రూ.13 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి కొన్ని నిబంధనలు పెడుతూ అర్హుల జాబితాతో పాటు అనర్హుల జాబితాను కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20లోపు సచివాలయాల ఇన్‌చార్జిలకు తెలియజేయాలి. వీటిని ఈ నెల 21 నుంచి 28 వరకు పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు సంబంధించిన తుది జాబితాను ఈ నెల 30న ప్రకటిస్తారు. శుక్రవారం నుంచి తల్లుల ఖాతాలో నగదు జమ అవుతుంది.
నిబంధనలు ఇవి..
12-సి ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశం పొందిన విద్యార్థులు, ఫ్రీ మెట్రిక్ పోస్టు ఉపకార వేతనాలు పొందుతున్న వారు, హౌస్ ఓల్డ్ డేటాలో లేని వారు, నాలుగు చక్రాల వాహనం ఉన్నవారి పిల్లలు, ఇన్‌కం టాక్స్ చెల్లిస్తున్న వారి పిల్లలు తల్లికి వందనం పథకానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులైన తల్లిదండ్రుల పిల్లలకు, 300 యూనిట్ల విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్న కుటుంబాలకు చెందిన పిల్లలకు కూడా ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేస్తారు. అనంతరం అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. జిల్లాకు సంబంధించి తల్లికి వందనం జాబితా దాదాపు ఖరారైంది. 1,08,951 మంది విద్యార్థులకు సంబంధించి 69,600మంది తల్లుల ఖాతాలకు నగదు జమకానుంది.