Share News

Safely to home. క్షేమంగా ఇంటికి

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:00 AM

Safely to home. అల్లర్లతో అట్టుడుకుతున్న నేపాల్‌లో చిక్కుకున్న జిల్లా యాత్రీకులు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మానససరోవరం యాత్రకు వెళ్లిన వారంతా ఊహించని పరిణామాలతో కఠ్మాండూలోని ఓ హోటల్‌లో ఉండిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో గురువారం జిల్లాకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో వారికి జిల్లా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రభుత్వ సహకారానికి యాత్రీకులంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Safely to home. క్షేమంగా ఇంటికి
నేపాల్‌ నుంచి వచ్చిన యాత్రికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు లలితకుమారి, బేబీనాయన, అదితిగజపతిరాజు

క్షేమంగా ఇంటికి

జిల్లాకు చేరిన నేపాల్‌ యాత్రీకులు

ప్రభుత్వ చొరవపై హర్షం

విశాఖ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు

విజయనగరం/ క్రైం/ రింగురోడ్డు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): అల్లర్లతో అట్టుడుకుతున్న నేపాల్‌లో చిక్కుకున్న జిల్లా యాత్రీకులు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. మానససరోవరం యాత్రకు వెళ్లిన వారంతా ఊహించని పరిణామాలతో కఠ్మాండూలోని ఓ హోటల్‌లో ఉండిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో గురువారం జిల్లాకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో వారికి జిల్లా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రభుత్వ సహకారానికి యాత్రీకులంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నేపాల్‌లో మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశమంతా అల్లర్లు జరుగుతున్నాయి. ఈ పరిణామాలకు ముందే జిల్లా నుంచి 61 మంది మానససరోవరం యాత్రకు బయలుదేరారు. అక్కడి ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎక్కడికక్కడ యువకులు వీధుల్లోకి వచ్చి దాడులు చేస్తున్నారు. దీంతో భయపడిన జిల్లా వాసులు కఠ్మాండూలోని ఓ హోటల్‌కు వెళ్లి అక్కడే ఉండిపోయారు. పరిస్థితిని జిల్లాలోని బంధువులకు తెలియజేయడంతో వీరు రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో పెట్టారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేశ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ నేపాల్‌ ఉన్న వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయించారు. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రీకులను 24 గంటలు తిరగక ముందే రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు. విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన 61 మందిలో విజయనగరంలోని బొంకులదిబ్బ, గాజులరేగ వాసులు 34 మంది కాగా మిగతా వారు బొబ్బిలి, ఎస్‌.కోటకు చెందినవారు. వీరిలో తెలుగుమహిళా ప్రతినిధి పత్తిగిల్లి సూర్యకుమారి కూడా ఉన్నారు.

ఎయిర్‌పోర్టులో అపూర్వ స్వాగతం

నేపాల్‌ నుంచి వచ్చిన జిల్లా యాత్రీకులకు విశాఖ ఎయిర్‌పోర్టులో జిల్లా ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, బేబీనాయన, అదితిగజపతిరాజులు సాదర స్వాగతం పలికారు. సాయంత్రం 4 తర్వాత విమానం దిగిన వారంతా జిల్లా నుంచి వెళ్లిన ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. వారికి రవాణాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో 12 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి రాత్రి 7 గంటల తరువాత వారి ఇళ్లకు చేర్చారు.

ప్రభుత్వ చొరవపై యాత్రీకుల హర్షం

నేపాల్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన యాత్రీకులు అక్కడ జరిగే అల్లర్లతో ఏమౌతామోనన్న ఆందోళనలో ఉండిపోయారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. ఒక రోజు వ్యవధిలో రాష్ట్రానికి తీసుకువచ్చింది. దీంతో వారంతా చాలా ఆనందపడుతూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రాణాలతో బయటపడ్డాం

పి.సూర్యకుమారి, గాజులరేగ, విజయనగరం

నేపాల్‌లోని కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాం. నాలుగురోజుల తరువాత ఎక్కడ చూసినా ఘర్షణలు అల్లర్లు చెలరేగడం కనిపించింది. మా ముందే పెద్ద పెద్ద కత్తులతో యువకులు తిరిగేవారు. తిరిగి ఇంటికి వేళ్తామా? లేదా? అనే సందేహం కలిగింది. అంతలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు భరోసా కలిగించాయి. మంత్రులు మాట్లాడి ధైర్యం చెప్పారు. మాకోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి విశాఖపట్నం వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి మా ఇంటికి చేర్చారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.

ప్రభుత్వ చొరవతో క్షేమం

కర్రోతు గోవింద, విజయనగరం

మేము నేపాల్‌లో చిక్కుకున్నామని తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే మమ్మల్ని తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చొరవ తీసుకున్నారు. ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. ప్రభుత్వ చొరవ వల్లే ఇంటికి క్షేమంగా చేరగలిగాం.

Updated Date - Sep 12 , 2025 | 12:00 AM