Share News

Safe on the Nagavali coast నాగావళి తీరంలో భద్రం

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:52 PM

Safe on the Nagavali coast నాగావళి నది చెంత ఉన్న గ్రామాల్లో పరిస్థితులు, నది గట్టు పటిష్టతపై కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆరా తీశారు. వర్షాలకు నదిలో వరద ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు. నాగావళి నది లోతట్టు గ్రామం బొడ్డవలసను మంగళవారం ఆయన సందర్శించారు.

Safe on the Nagavali coast నాగావళి తీరంలో భద్రం
నాగావళి నదీ తీర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

నాగావళి తీరంలో భద్రం

పరిస్థితులపై ఆరా తీసిన కలెక్టర్‌ అంబేడ్కర్‌

బొడ్డవలస వద్ద నదిగట్టు, పొలాల పరిశీలన

సంకిలి వద్ద కరకట్ట నిర్మించాలని రైతుల విన్నపం

రేగిడి/సంతకవిటి/వంగర, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): నాగావళి నది చెంత ఉన్న గ్రామాల్లో పరిస్థితులు, నది గట్టు పటిష్టతపై కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆరా తీశారు. వర్షాలకు నదిలో వరద ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు. నాగావళి నది లోతట్టు గ్రామం బొడ్డవలసను మంగళవారం ఆయన సందర్శించారు. నది ప్రవాహాన్ని పరిశీలించాక ఇరిగేషన్‌ డీఈఈ గన్నిరాజు, ఆర్‌డీవో అశయ్య, తహశీల్దార్‌ కృష్ణలతతో చర్చించారు. రేగిడి, సంతకవిటి మండలాల్లో దాదాపు 22 వరదముంపు గ్రామాలున్నాయని వారు వివరించారు. లోతట్టు గ్రామాల్లో నదిలోకి ఎవరినీ దిగనివ్వకుండా చూడాలని కలెక్టర్‌ సూచించారు. అక్కడే ఉన్న కొందరు రైతులు సంకిలి శివాలయం పైభాగంలో బ్రిటీష్‌కాలంలో నిర్మించిన కరకట్ట పాడైందని, ఇక్కడ గండికొడితే రెండు మండలాల్లో 12వేల ఎకరాల అయకట్టుతో పాటు కొన్నిగ్రామాలకు వరద ముంచుకొస్తుందని విన్నవించారు. కొత్త కరకట్ట నిర్మించాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ అక్కడే ఉన్న ఇరిగేషన్‌, రెవెన్యూ అధికార్లకు దీనిపై వివరణ అడిగారు. ప్రతిపాదనలు ఏదశలో ఉన్నాయో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

- సంతకవిటి మండలం కొత్తూరు రామచంద్రపురం దగ్గర నాగావళి నది ప్రవాహాన్ని కలెక్టర్‌ అంబేడ్కర్‌ మంగళవారం పరిశీలించారు. తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. రిటర్నింగ్‌ వాల్‌ కావాలని ప్రజలు కలెక్టర్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ తక్షణ సాయం కింద రిటర్నింగ్‌ వాల్‌ కోసం ఐదు లక్షల రూపాయలు రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ అఽధికారులతో మాట్లాడి రాజాంకు బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.

- వంగర మండలంలోని మడ్డువలస రిజర్వాయర్‌ను కూడా కలెక్టర్‌ అంబేడ్కర్‌ మంగళ వారం సందర్శించారు. రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో విషయమై ఆరా తీశారు. లోతట్టు గ్రామాల ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈ సుధాకర్‌బాబుకు ఆదేశించారు. అవసరమైతే డ్రోన్‌లు ఉపయోగించి మందు పిచికారీ చేసి వాటిని తొలగించాలన్నారు. ప్రధాన గేట్ల నుంచి నీరు విడుదల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, మత్స్యకారులను సైతం గేట్ల వద్దకు రానీయకుండా చూడాలన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:52 PM