Share News

sad situation in farmers కల్లాల్లో ధాన్యం.. రైతుల్లో దైన్యం!

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:14 AM

sad situation in farmers రాజాం మండల రైతులు వారం రోజుల కిందటే బస్తాల్లోకి ధాన్యం ఎత్తి అమ్మకానికి సిద్ధం చేశారు. రైతుసేవా కేంద్రం సిబ్బంది పరిశీలించి ట్రక్‌షీట్లు జనరేట్‌ చేయాలి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రోజులకొద్దీ ధాన్యం బస్తాలు కల్లాల్లోనే ఉండిపోతున్నాయి.

sad situation in farmers  కల్లాల్లో ధాన్యం.. రైతుల్లో దైన్యం!
రాజాం మండలంలోని ఓ గ్రామంలో కల్లాల్లోనే ధాన్యం నిల్వలు

కల్లాల్లో ధాన్యం.. రైతుల్లో దైన్యం!

ట్రక్‌షీట్ల జారీలో తీవ్ర జాప్యం

వాహనాల కొరతతో ఇబ్బందులు

మిల్లర్ల నిర్లక్ష్యం... పూర్తికాని బ్యాంక్‌ గ్యారెంటీలు

అధికారుల పర్యవేక్షణ కరువు

రాజాం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

రాజాం మండల రైతులు వారం రోజుల కిందటే బస్తాల్లోకి ధాన్యం ఎత్తి అమ్మకానికి సిద్ధం చేశారు. రైతుసేవా కేంద్రం సిబ్బంది పరిశీలించి ట్రక్‌షీట్లు జనరేట్‌ చేయాలి. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రోజులకొద్దీ ధాన్యం బస్తాలు కల్లాల్లోనే ఉండిపోతున్నాయి. ఒక్క రాజాంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అధికారులు మాత్రం అంతా సవ్యంగా జరిగిపోతోందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. మిల్లర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. దాదాపు సగానికి పైగా వరి కోతలు పూర్తికాగా.. ధాన్యం కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి ఒక్కో బస్తా వద్ద రూ.100 నుంచి రూ.200 తక్కువచేసి కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు.

జిల్లాలో రైతుసేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లక్ష్యం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఇప్పటివరకూ రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా 2,25,000 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఇదే సమయంలో రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలను ఇంకా సమర్పించాల్సి ఉంది. ఇప్పటివరకూ రూ.200 కోట్లకు మాత్రమే మిల్లర్లు బ్యాంక్‌ గ్యారెంటీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో ట్రక్‌షీట్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

కొనుగోలు ప్రక్రియ ఇలా..

తొలుత వ్యవసాయ శాఖ సహాయకులు పంట వివరాలను రైతుసేవా కేంద్రంలో నమోదుచేసి కూపన్లు ఇస్తారు. వాటి ఆధారంగా టెక్నికల్‌ సిబ్బంది కల్లాల వద్దకు వెళ్లి తేమశాతాన్ని పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఉంటే బస్తాల్లో ధాన్యం వేసి తూకం చేస్తారు. అనంతరం ట్రక్‌లో వేసి రైతుసేవా కేంద్రం వద్దకు తీసుకెళ్లాలి. అక్కడ పేరు, ఎన్నిబస్తాలు? సామర్ధ్యం అన్న వివరాలు నమోదుచేశాక ట్రక్‌షీట్‌ జనరేట్‌ అవుతుంది. దీనిని పట్టుకొని ట్యాగ్‌ అయిన మిల్లులకు ధాన్యాన్ని తరలించాలి.

వాహనాలు లేక..

మిల్లులకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో లేవు. సొంత వాహనం ఉంటే నేరుగా రైతు ఖాతాలో డబ్బులు జమవుతాయి కానీ ప్రతి రైతుసేవా కేంద్రంలో ప్రైవేటు వాహనదారులే రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. దీంతో వారి ఖాతాల్లోనే రవాణా చార్జీలు జమవుతున్నాయి. రిజిస్ర్టేషన్‌ అయిన వాహనాలు వ్యవసాయ పనులకు వెళుతున్నాయి. వాహనాలు దొరకని పరిస్థితి. ఒకవైపు ట్రక్‌షీట్లు జనరేట్‌కాక.. మరోవైపు వాహనాలు దొరకక రోజుల తరబడి ధాన్యం కల్లాల్లో నిల్వ ఉండిపోతున్నాయి. ఇదే అదునుగా దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రకరకాలుగా ఒత్తిడి చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించుకుపోతున్నారు. బస్తా వద్ద రూ.100 నుంచి రూ.200 వరకూ కోల్పోవాల్సి వస్తోంది. దీనికితోడు 80 కిలోల బస్తా వద్ద మిల్లర్లు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. జిల్లా అధికారులు మాత్రం అంతా సవ్యంగా కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.

సవ్యంగా కొనుగోళ్లు

జిల్లాలో ధాన్యం కొనుగోలు సవ్యంగానే సాగుతోంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంప్రదించాలి. బ్యాంక్‌ గ్యారెంటీల్లో ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే. దానిని సరిచేశాం. ట్రక్‌షీట్ల జారీలో జాప్యం వద్దని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ప్రతిరైతుకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేస్తాం.

- బి.శాంతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా అధికారి

---

మారని మిల్లర్లు

ధాన్యం సేకరణలో చేతివాటం

విజయనగరం కలెక్టరేట్‌, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి):

- బొబ్బిలి నియోజకవర్గంలో పలువురు మిల్లర్లు రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటున్నారంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై ఎమ్మెల్యే బేబీనాయన సైతం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు తనపేరు వినియోగిస్తున్నట్లు తెలిసి అసహనం వ్యక్తం చేశారు.

- గంట్యాడ మండలంలోని ఓ రైసు మిల్లు యజమాని అదనంగా ధాన్యం ఇవ్వాలి. లేదా డబ్బులైనా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారని ఓ రైతు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

ఇటువంటి సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అధికారులకు చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై కఠిన చర్యలు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. గత నెల 16న ధాన్యం సేకరణ తంతు మొదలు పెట్టారు. 359 రైతు సేవ కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 37,800 మంది రైతుల నుంచి సుమారు రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు గాను రూ.373 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బిల్లులు వెంట వెంటనే రైతు ఖాతాలకు జమవుతున్నాయి. అయితే మిల్లర్లు అదనంగా ధాన్యం ఇవ్వాలని లేదా వాటికి బదులుగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేయడమే సమస్య అవుతోంది.

- అదనంగా ధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్న మిల్లర్లకు సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ డీఎం శాంతి ఇటీవల నోటీసులు జారీ చేశారు. చీపురుపల్లిలో కెవిఆర్‌ వరలక్ష్మి రైస్‌ ఇండస్ర్టీ, బొబ్బిలి మండలంలోని కింతలవాణిపేటలో కెవిఆర్‌ వెంకట్‌ కామేశ్వరి రైసుమిల్లు, కోమటిపల్లిలో శ్రీమహాలక్ష్మి రైస్‌మిల్లు, గొల్లపల్లి శ్రీసాయి వెంకట్‌ కామేశ్వరి రైస్‌మిల్లు, తెర్లాంలోని ఉమా మహేశ్వరి రైస్‌మిల్లు, గంట్యాడ మండలంలోని రావివలసలో కనకదుర్గ రైసుమిల్లు తదితర యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.

కల్లాల వద్దే కొనుగోళ్లు

వేపాడ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి):

వేపాడ మండలంలో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారు. కల్లాల వద్దే అధికంగా అమ్మకాలు జరిగిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఉన్నా దళారుల చేతుల్లో నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల పేరున ట్రక్‌సీట్లు మంజూరు చేస్తున్నా ధాన్యం రవాణా చేసేది కూడా వ్యాపారులే. ప్రభుత్వం 100 కేజీల సాధారణ రకం ధాన్యంపై రూ.2369లుగా మద్దతు ధర నిర్ణయించింది. అలాగే 82 కేజీల ధాన్యంపై రూ.1895లుగా ధర నిర్ణయించగా దళారులు 82 కేజీలు అని చెప్పి రైతు నుంచి 86 కేజీల వరకు తూకం వేస్తున్నారు. దీనికి చెల్లించేది కేవలం రూ.1750 మాత్రమే. వ్యాపారులు సొంత మనుషులతో తూకం వేయిస్తూ వాహనాలకు లోడింగ్‌ చేయించుకుంటున్నారు. ధాన్యం విక్రయించే రైతు పేరునే ట్రక్‌సీటు తెప్పించుకుంటున్నారు. మండలంలో మిల్లులు లేకపోవడం రైతులకు శాపంగా మారింది.

ఈకేవైసీ ఆప్షన్‌ ఇవ్వక అవస్థలు

సంతకవిటి, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): ఈకేవైసీ సవరణ ఆప్షన్‌ లేక సంతకవిటి మండలంలో చాలా మంది రైతులు ఈ ఏడాది ధాన్యం విక్రయించుకోలేకపోతున్నారు. గత ఏడాది ఈకేవైసీ ఆప్షన్‌ ఉండడం వల్ల ఆ రైతుకు ఈకేవైసీ అయ్యిందో లేదో, ఆధార్‌ లింక్‌ అయ్యిందో లేదో వంటి విషయాలు తెలుసుకునే వెసులుబాటు ఉండేది. ఈ ఏడాది ఆప్షన్‌ లేకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధిత అధికారులు కూడా రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర మండలాల్లోనూ ఈ సమస్య ఉంది. సంతవిటి మండలంలో 22000 ఎకరాల్లో వరి పంట వేశారు. తమరాం, మామిడిపల్లి, మండవకురిటి, హొంజరాం, బిళ్లాణి, గరికపాడు, సురవరం తదితర గ్రామాల్లో పంటకు ఈక్రాప్‌ నమోదైనప్పటికీ ఆధార్‌ లింక్‌ పూర్తికాక రైతులు పండించిన పంటను ఎలా అమ్ముకోవాలోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వీటీ రామారావు వద్ద ప్రస్తావించగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇకనుంచి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఎక్కడెక్కడ ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయో అక్కడ కొనుగోలు జరిగేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Dec 21 , 2025 | 12:15 AM