sad situation చదువు కోసం వచ్చి విగతజీవిగా మారి
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:49 PM
sad situation విజయనగరం ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహంలో ఓ డిగ్రీ విద్యార్థిని గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అప్పటి వరకూ తోటి పిల్లలతో సరదాగా గడిపిన ఆమె అంతలోనే విగతజీవిగా మారడం చూసిన తోటి విద్యార్థులు విషాదంలో ఉండిపోయారు. అచేతన స్థితిలో కుమార్తెను చూసిన తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
చదువు కోసం వచ్చి విగతజీవిగా మారి
బీసీ కళాశాల వసతిగృహంలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
దుఃఖ సాగరంలో తల్లిదండ్రులు
విజయనగరం క్రైం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): విజయనగరం ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహంలో ఓ డిగ్రీ విద్యార్థిని గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అప్పటి వరకూ తోటి పిల్లలతో సరదాగా గడిపిన ఆమె అంతలోనే విగతజీవిగా మారడం చూసిన తోటి విద్యార్థులు విషాదంలో ఉండిపోయారు. అచేతన స్థితిలో కుమార్తెను చూసిన తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా గార మండలం చినతోణంగి గ్రామానికి చెందిన కల్లి స్వాతి (17) ఈ ఏడాది ఎంఆర్ అటానమస్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది. బీఎస్సీ చదువుతూ బీసీ వసతిగృహంలో ఉంటోంది. గురువారం ఉదయం తోటి పిల్లలతో కొద్దిసేపు గడిపాక ఈరోజు కళాశాలకు రాను అని, ఒంట్లో నీరసంగా ఉందని చెప్పి గదిలోనే ఉండిపోయింది. కళాశాలకు వెళ్లిన మిగతా విద్యార్థులు తిరిగి వసతిగ ృహానికి వచ్చి గదిలోకి వెళ్లేసరికి స్వాతి ఫ్యానుకు వేళాడుతూ కన్పించింది. భయాందోళనతో పరుగులు తీసిన విద్యార్థినులు వసతి గృహం వార్డెన్‌కి సమాచారం అందించారు. వార్డెన్ కృష్ణవేణి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్వాతిని కిందకు దించారు. కొనఊపిరితో ఉన్నట్టు భావించి 108 సమాచారం అందించారు. అనంతరం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వార్డెన్ ఫిర్యాదుతో టూటౌన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కనకరాజు, క్లూస్ టీం అక్కడికి చేరుకుని వసతిగృహం పరిసరాలు, గదిలో ఫ్యానుకు ఉరేసుకున్న ఆనవాళ్లను నిశితంగా పరిశీలించారు. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశామని, సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
అంతలోనే ఘోరం
మొన్నటివరకు తమతో సరదాగా గడిపిందని, ఈనెల 1న విజయనగరం బయలుదేరి వచ్చిందని, అంతలోనే ఘోరం జరిగిందంటూ తల్లి కృష్ణవేణి కన్నీరుమున్నీరైంది. తండ్రి శాంతారావు కూడా కుమార్తె మృతిని జీర్ణించుకోలేకపోతున్నాడు. స్వాతి ఆ ఇంటికి పెద్దకుమార్తె. ఉన్నత చదువులు చదివించాలని ఆ కుటుంబం ఎంతో ఆశపడింది. ఇంతలోనే కుమార్తె చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని తల్లిదంద్రులు వాపోయారు. తమకుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, నాలుగు రోజుల క్రితమే ఇంటికి వచ్చిందని చెబుతున్నారు. ఏమి జరిగిందో. ఏమో కాని కూతురును దేవుడు తీసుకుపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు.
--------------------------