S. Kota to Visakhapatnam district...! విశాఖ జిల్లాలోకి ఎస్.కోట...!
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:21 AM
S. Kota to Visakhapatnam district...! శృంగవరపుకోట, లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడ, జామి మండలాలతో కలిసి ఉన్న శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖటపట్నం జిల్లాలో కలువనుంది. ఈమేరకు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. డిసెంబర్ నాటికి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక నెరవేరుతుంది.
విశాఖ జిల్లాలోకి ఎస్.కోట...!
ప్రతిపాదించిన కూటమి ప్రభుత్వం
నెరవేరనున్న ఈ ప్రాంత వాసుల కల
డిసెంబర్ నాటికి కార్యరూపం దాల్చే అవకాశం
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయం
న్యాయం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
శృంగవరపుకోట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి):
శృంగవరపుకోట, లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడ, జామి మండలాలతో కలిసి ఉన్న శృంగవరపుకోట నియోజకవర్గం విశాఖటపట్నం జిల్లాలో కలువనుంది. ఈమేరకు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. డిసెంబర్ నాటికి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈ నియోజకవర్గం విశాఖపట్నానికి ఆనుకుని ఉంది. దీంతో వాణిజ్య, వ్యాపార పరంగానూ ఈ ప్రాంత వాసులు విశాఖపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీనికితోడు విజయనగరం జిల్లా ఆవిర్భావానికి ముందు విశాఖ జిల్లాలోనే ఈ మండలాలన్ని ఉండేవి. దీంతో గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు పూనుకున్నప్పుడు తిరిగి ఈ మండలాలన్నీ విశాఖ జిల్లాలో కలిపేస్తారని అంతా ఊహించారు. ఈ నియోజకవర్గం విశాఖపార్లమెంటు పరిధిలోనే ఉంది. ఈ విధంగానైనా విశాఖ జిల్లాలో కలిసిపోతుందని ఈ ప్రాంత ప్రజలు భావించారు. వైసీపీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తీరా కొత్త జిల్లాలు రూపాంతరం చెందే సమయానికి విజయనగరం జిల్లాలోనే ఈ నియోజకవర్గాన్ని ఉంచేసింది. స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దీన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా వాడింది. ఈ నియోజకవర్గ కేంద్రం శృంగవరపుకోట పట్టణంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత విశాఖ ఎంపి ఎం.శ్రీభరత్, శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి సమక్షంలో పార్టీ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గాన్ని విశాఖపట్టణం జిల్లాలో కలిపేస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. వైసీపీ చేసిన అన్యాయాన్ని సరిదిద్దుతున్నారు. జిల్లాల పునర్వీభజన సమయంలో దీన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తే అన్ని విధాల అభివృద్ధి చెందేదని, విశాఖ జిల్లాలో ఈ నియోజకవర్గం కలపాలని ఇక్కడ ప్రజలు పెద్ద ఉద్యమమే చేసినా అధికారంలో వున్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అప్పట్లో వ్యాఖ్యానించారు. చరిత్ర, భౌగోళికం, పరిపాలన సౌలభ్యం వంటి వాటిని పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేయడంతో పాటు విశాఖ మహానగరంతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పేర్లు మార్పు, డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను పరిశీలించడానికి మంత్రి వర్గ ఉపసంఘం నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పరిపాలన సౌలభ్యం, వాస్తవిక పరిస్థితులు, చారిత్రక, భౌగోళికంగా ఆయా ప్రాంతాల మధ్య ఆర్దిక, సామాజిక సమతుల్యతను పెంపొందించేలా నిర్ణయం తీసుకోవాలని ఆ కమిటీకి మార్గనిర్దేశం చేసింది. భౌగోళికంగా, చారిత్రకంగా ఈ నియోజకవర్గం విశాఖపట్నానికి దగ్గరగా ఉంటుంది. ఈ నియోజకవర్గ పరిధిలో వున్న కొత్తవలస మండలం ఈ జిల్లా సరిహద్దుకు కేవలం కిలోమీటరు దూరం కూడా ఉండదు.
- శృంగవరపుకోట నియోజకవర్గం పూర్తిగా విశాఖపట్టణం జిల్లాలో ఉండేది. 1979లో శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాలు, విశాఖ జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలను విడదీసి విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. ఇంతవరకు జిల్లాలో ఉన్నప్పటికీ ఇప్పటికి ఈ నియోజకవర్గ ప్రజలకు విశాఖ జిల్లాతోనే అనుబంధం ఎక్కువ. ఉపాధి, ఉద్యోగాలు అక్కడే చేస్తున్నారు. విశాఖ నుంచి అరకు పర్యాటక ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది.. ప్రస్తుత ప్రభుత్వం జిల్లాల పునర్వీభజనలో జరిగిన లోటుపాట్లు సరిదిద్దేక్రమంలో ఎస్.కోటను విశాఖ జిల్లాలో కలిపేందుకు ప్రాతిపాదన చేసింది.
- విశాఖపట్టణం ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. దీన్ని ఆనుకుని ఉన్న ఎస్.కోట నియోజకవర్గంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పారిశ్రామీకరణ వైపు అడుగులు వేస్తోంది. ఎంఎస్‌ఎంఈ పార్కులు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు వంటి వాటిని నిర్మించే ప్రయత్నం చేస్తోంది. విశాఖ నగరంతో అనుసంధానం ద్వారా వ్యాపార, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి రేటు మరింతగా సాధించే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.