RTC on the new way కొత్తబాటలో ఆర్టీసీ
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:38 AM
RTC on the new way ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం నిర్వహణతో భారం పడకుండా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా కార్గో సేవలను పెంచుకోనుంది. మరోవైపు టెంపుల్ టూరిజం, శుభకార్యాలకు తక్కువ ధరకే ఆర్టీసీ సేవలను అందుబాటులో తెస్తోంది. దీనిపై ప్రజలకు అవగాహన పెంచాలని భావిస్తోంది.
కొత్తబాటలో ఆర్టీసీ
సేవల విస్తరణే లక్ష్యం
రవాణాతో పాటు కొరియర్స్
కార్గో సర్వీసులు సైతం విస్తృతం
ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నం
రాజాం, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి):
ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం నిర్వహణతో భారం పడకుండా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా కార్గో సేవలను పెంచుకోనుంది. మరోవైపు టెంపుల్ టూరిజం, శుభకార్యాలకు తక్కువ ధరకే ఆర్టీసీ సేవలను అందుబాటులో తెస్తోంది. దీనిపై ప్రజలకు అవగాహన పెంచాలని భావిస్తోంది.
ఉమ్మడి జిల్లాల పరిధిలో ఐదు డిపోలు ఉన్నాయి. విజయనగరం, శృంగవరపుకోట, సాలూరు, పార్వతీపురం, పాలకొండలోని డిపోల పరిధిలో దాదాపు 450 బస్సులున్నాయి. ఇవి రోజుకు సగటున 1.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. రోజుకు 95 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. విశాఖ, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భద్రాచలం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, హైదరాబాద్‌కు సైతం సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్గో సేవలను కొన్నేళ్ల కిందట ప్రారంభించింది. దానిని మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 24 గంటలూ బస్సుల రాకపోకలు ఉండడంతో చాలా సులువుగా, వేగంగా కొరియర్ సర్వసులు ఆర్టీసీ ద్వారా అందుతున్నాయి. ఆపై ప్రభుత్వరంగ సంస్థ కావడంతో ప్రజల్లో భద్రత, నమ్మకం ఉంటోంది. పైగా రాష్ట్రంలో 80 నగరాలు, పట్టణాల్లో ఆర్టీసీ డోర్ డెలివరీని విస్తరించింది. పట్టణాల్లో అయితే 10 కిలోమీటర్ల పరిధి వరకూ ఇళ్లకు పార్సిల్ అందిస్తోంది. దీంతో ప్రజలు సైతం ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను ఎక్కువగా ఆశ్రయించడం ప్రారంభించారు.
- ప్రస్తుతం ఆర్టీసీ కార్గో సర్వీసుల్లో 50 కిలోల వరకూ పార్సిల్స్ పంపించే అవకాశం కల్పించారు. కిలో బరువుకు రూ.18, ఆరు కిలోలకు రూ.30, పది కిలోలకు రూ.36, 25 కిలోలకు రూ.48, 50 కిలోలకు రూ.59 చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి 50 కిలోల వరకూ మాత్రమే అవకాశం ఇచ్చింది. అయితే ప్రజల నుంచి అంతకంటే మించిన బరువుకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు సైతం ఏపీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయి. జీడిపప్పు, బియ్యం, ధాన్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి వ్యాపారవర్గాలు బుక్ చేసుకుంటే ఆర్టీసీ కార్గో సేవలను అందిస్తోంది. ఇంకోవైపు గ్రామాల్లో రైతుసేవా కేంద్రాలకు విత్తనాలు, ఎరువులు సైతం ఆర్టీసీ కార్గో ద్వారా అందిస్తున్నారు.
తక్కువ ధరకే అద్దెకు బస్సులు..
టెంపుల్ టూరిజంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. శుభకార్యాలకు సైతం అద్దెకిస్తోంది. ప్రైవేటు బస్సులతో పోల్చుకుంటే కొంత వెసులబాటు ఇస్తోంది. ప్రాంతం, దూరం, సమయం బట్టి చార్జీలను నిర్ణయిస్తోంది. సుమారు 6 గంటల పాటు అద్దె రూపంలో శ్లాబులు ఉంటాయి. 24 గంటలు దాటితే మాత్రం కిలోమీటర్ల ఆధారంగా చార్జీలు విధిస్తున్నారు. ఆల్ర్టా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు అందుబాటులో ఉంటాయి. పల్లెవెలుగుకు అద్దె తక్కువగా ఉండడంతో జిల్లాలో ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. పైగా 50మంది ప్రయాణించే వెసులుబాటు ఉంది. దీంతో శుభకార్యాలకు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించడం కనిపిస్తోంది. ఆపై అన్ని ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో సైతం బుకింగ్ కౌంటర్లు ఏర్పాటుచేయడంతో ప్రజలు సులువుగా ఈ బస్సులను బుక్ చేసుకుంటున్నారు.
రవాణాతో పాటు సేవలు..
ప్రజలకు రవాణా సేవతో పాటు కొరియర్ సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. 50 కిలోల్లోపు వస్తు సామగ్రిని సులువుగా గమ్యస్థానాలకు చేర్చుతోంది. కార్గో సేవలు సైతం సాధారణ ధరకే అందుబాటులో ఉన్నాయి. పారిశ్రామిక, వాణిజ్య అవసరాలను సైతం తీర్చుతోంది. టెంపుల్ టూరిజం, శుభ కార్యాలకు బస్సులు అవసరమైన వారు ప్రతి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉండే కౌంటర్లతో పాటు అధికారులను సంప్రదించవచ్చు.
- జి.వరలక్ష్మి, జిల్లా ప్రజారవాణా అధికారి, విజయనగరం
----------------