రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.40 కోట్లు
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:18 AM
బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.40కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్టు ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.

బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన
బొబ్బిలి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.40కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించినట్టు ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. బుధవారం బొబ్బిలిలోని దర్బారు మహల్‌లో పంచాయతీరాజ్ డీఈ, ప్రాజెక్ట్స్ డీఈలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి రోడ్ల నిర్మాణం జరగలేదన్నారు. మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు హయాంలో మంజూరైన పనులను గత ప్రభుత్వం విస్మరించడంతో దాదాపు 43 గ్రామాలకు రోడ్ల కనెక్టవిటీ లేకుండా పోయిందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.20కోట్లతో 16 గ్రామాల మధ్య పక్కా రోడ్ల నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరానని చెప్పారు. రాబోయే నాలుగేళ్ల కాలంలో దశలవారీగా చేపట్టేందుకు రోడ్ల పనులపై సమగ్ర నివేదికను తయారు చేయాలని కోరామన్నారు. ఇంకా ఈ ఏడాదిలో ప్రతి గ్రామంలో రోడ్లు, కాలువలు నిర్మాణానికి రూ.40కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఈ నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో పీఆర్ డీఈఈ అప్పారావు, ప్రాజెక్ట్స్ డీఈఈ సీతంనాయుడు, టీడీపీ నాయకుడు అల్లాడ భాస్కరరావు, నాలుగు మండలాల జేఈలు రుక్మాంగదనాయుడు, రాజశేఖర్, రమేష్, సత్యంనాయుడు పాల్గొన్నారు.