రైతులకు రూ.3కోట్ల టోకరా
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:59 PM
ఓ ప్రైవేట్ కంపెనీ మొక్కజొన్న రైతులకు రూ.3కోట్ల వరకు టోకరా పెట్టిన ఘటన మండలంలో వెలుగుచూసింది.
- పంటను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించని వైనం
- కంపెనీ ప్రతినిధులకు నిలదీత
- ఇరువర్గాల మధ్య కొట్లాట
పూసపాటిరేగ, సెప్టెంబరు19 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేట్ కంపెనీ మొక్కజొన్న రైతులకు రూ.3కోట్ల వరకు టోకరా పెట్టిన ఘటన మండలంలో వెలుగుచూసింది. గతేడాది ఓ కంపెనీకి చెందిన ప్రతినిధులు వివిధ గ్రామాలకు వెళ్లి ‘ మేమే మొక్కజొన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తాం. పంటను సాగు చేయండి. అధిక ధరకు కొనుగోలు చేస్తాం’ అని ప్రచారం చేశారు. దీనికోసం కొంతమంది దళారులను కంపెనీ నియమించుకుంది. వారి మాటలను నమ్మిన పలు గ్రామాల రైతులు తమ పొలాల్లో ఆ కంపెనీ ఇచ్చిన విత్తనాలు నాటి మొక్కజొన్నను సాగు చేశారు. ఈ పంటను తీసుకున్న సదరు కంపెనీ రైతులకు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు. కంపెనీ ప్రతినిధులు, దళారులను అడుగుతున్నా ఇదుగో, అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సుమారు రూ.3కోట్ల వరకు ఆ కంపెనీ నుంచి రైతులకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రెల్లివలస కొండగుడ్డి వద్ద ఆ కంపెనీ వ్యక్తులు, దళారీలు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ విషయం గతంలో మోసపోయిన రైతులకు తెలిసింది. దీంతో వారంతా రెల్లివలస వెళ్లి పంట డబ్బులు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. దళారులను అడగండంటూ వారు చెప్పడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. దీంతో వారితో గొడవకు దిగారు. ఇది కొట్లాటకు దారితీసింది. తమను మోసం చేసిన వారిపై వ్యవశాయశాఖకు ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు. జిల్లా వ్యవశాయశాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.