Rs. 26 crores for the district! జిల్లాకు రూ.26 కోట్లు!
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:15 AM
Rs. 26 crores for the district! పంచాయతీలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులు రూ.26.55 కోట్లు మంజూరు చేసింది. 27 మండలాలకు ఈ నిధులు సర్దుబాటు చేయనున్నారు.
జిల్లాకు రూ.26 కోట్లు!
తొలి విడత ఆర్థిక సంఘం నిధులు విడుదల
జిల్లాలో అన్ని పంచాయతీలకు కేటాయింపు
పల్లెల్లో మౌలిక సదుపాయాలకు అవకాశం
పంచాయతీలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులు రూ.26.55 కోట్లు మంజూరు చేసింది. 27 మండలాలకు ఈ నిధులు సర్దుబాటు చేయనున్నారు. పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన కేటాయించనున్నారు. అయితే జిల్లాలో ఓ నాలుగు పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో నిధులు సర్దుబాటు కాలేదు. మిగిలిన పంచాయతీల్లో వీధి దీపాలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణ, సిబ్బంది జీతాల సమస్యలు తీరనున్నాయి.
రాజాం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 777 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో ఓ నాలుగింటికి ఎన్నికలు జరగలేదు. దీంతో 774 పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులను సర్దుబాటు చేయనున్నారు. మొత్తం రూ.26.55 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో అన్‌టైడ్ రూ.10.62 కోట్లు కాగా టైడ్ కింద రూ.15.93 కోట్లు ఇవ్వనున్నారు. ఈ మొత్తం నిధులను పంచాయతీ ఖాతాలకు జమ చేయనున్నారు. కాగా చాలా పంచాయతీల్లో నిర్వహణ కష్టతరంగా మారింది. తక్కువ ఆదాయం రావడంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులే దిక్కు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక సంఘం నిధుల విడుదలలో ఎటువంటి జాప్యం చేయలేదు. ఠంఛనుగా విడుదల చేస్తూ వస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్ ఉంచకుండా చేసింది. ఈ విషయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న పవన్‌కల్యాణ్ చొరవ ఉంది.
అప్పట్లో నిర్వీర్యం..
వైసీపీ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా నిర్వీర్యం అయ్యేవి. కేంద్రం ఈ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన మరుక్షణం వైసీపీ ప్రభుత్వం వేరే ఖాతాలకు మళ్లించేది. సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాలకు బదలాయించేది. దీంతో గ్రామాల్లో మౌలిక వసతులకల్పన జరిగేది కాదు. కనీసం పారిశుధ్యం పనులు చేపట్టేందుకు కూడా నిధులు లేకుండా పోయేవి. అప్పట్లో సర్పంచ్‌లు, కార్యదర్శులకు తెలియకుండా కూడా నిధులు మళ్లించిన సందర్భాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారింది. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (పీఎఫ్‌ఎంఎస్) ద్వారా వేరే అవసరాలకు వినియోగించకుండా చేశారు. అప్పటి నుంచి సవ్యంగా ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు దక్కుతున్నాయి. గత ఏడాది ఆర్థిక సంఘం నిధులు విడుదలైనప్పుడే పంచాయతీలకు ప్రత్యేక ఖాతాలు తెరిచారు. ప్రాధాన్యతాక్రమంలో అన్ని పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి.
నిధుల విడుదల
జిల్లాలోని అన్ని పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. వీటిని నిబంధనల ప్రకారం ఖర్చుచేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో మరింత మెరుగైన వసతులు అందించేందుకు ఈ నిధులు ఎంతగానో దోహదపడనున్నాయి.
- డీవీ మల్లికార్జునరావు, డీపీవో, విజయనగరం