దోపిడీ బార్లు
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:14 AM
మద్యంప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు బార్‌ల యజమానులు బరితెగించి వ్యవహరిస్తున్నారు.
- అధిక ధరలకు మద్యం విక్రయం
- మందుబాబుల జేబులు గుల్ల
-కానరాని పరిశుభ్రత.. సౌకర్యాలు
- మామూళ్ల మత్తులో యంత్రాంగం
మెంటాడ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మద్యంప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు బార్‌ల యజమానులు బరితెగించి వ్యవహరిస్తున్నారు. అధిక రేట్లతో మందుబాబుల జేబులు గుళ్లచేస్తున్నారు. ఇదేమని అడిగినవారిపై దౌర్జన్యానికి తెగబడుతున్నారు. అధికారులు, రాజకీయనేతల అండతోనే వారు పేట్రేగిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల కాలపరిమితితో నూతన బార్ పాలసీలో భాగంగా విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొత్తగా 41 పాంతాల్లో బార్‌ల ఏర్పాటుకు ఎక్సైజ్ యంత్రాంగం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. శనివారం లాటరీ నిర్వహించి బార్‌లు కేటాయిస్తారు. సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్లు ప్రారంభమవుతాయి.
అదనపు బాదుడు..
విజయనగరం జిల్లాలోని కొందరు బార్‌ల యజమానుల ఇష్టారాజ్యంగా ధరలు పెంచి మందు విక్రయిస్తున్నారు. బ్రాడ్లతో సంబంధం లేకుండా క్వార్టర్‌పై రూ.వంద అదనంగా వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే వైన్ షాపులకు ఇచ్చే మార్జిన్ తమకు వర్తించదని చెప్పుకొస్తున్నారు. మద్యం దుకాణాలకు ప్రభుత్వం 14.5 శాతం మార్జిన్ ఇస్తుంటే, బార్ల యజమానులు మాత్రం దానికి మూడు నాలుగు రెట్లు ఎక్కువగా పిండేస్తున్నారు.
కనీస సౌకర్యాలు కరువు..
కొన్ని బార్లలో కనీస సౌకర్యాలు ఉండవు. టేబుళ్లను చూస్తేనే డోకు వస్తుంది. ఎటుచూసినా చెత్తాచెదారం, భరించలేని దుర్గంధం వెదజల్లుతుంది. ఫ్యాన్లు ఉన్నా లేనట్టే. ఏసీ గదుల పేరిట అదనపు బాదుడు తప్పదు. మద్యం, తిను బండారాలు ధరల జాబితా పెట్టారు. బిల్లు వచ్చే వరకూ బాదుడు తెలీదు. ఫ్రిడ్జిలో, ఐస్ బాక్సుల్లో వారాల తరబడి నిల్వచేసి బూజుపట్టిన పచ్చిమాంసాన్ని వండి, మద్యం ప్రియులు ఆరోగ్యాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. చివరకు వాటర్ బాటిళ్లు కూడా డబుల్ రేటుకి నకిలీ లేబుళ్లతో అంటగడుతున్నారు. సేవలు లేకపోయినా సర్వీసు చార్జీ మోత తప్పడం లేదు. ఇంత జరుగుతున్నా ఏ అధికారికీ పట్టదు. అటువైపు ఎవరూ కన్నెత్తి చూడరు. ఎవరైనా ఫిర్యాదు చేసినా తమది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వారికి నెలవారీ మామ్మూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సెప్టెంబరు 1 నుంచి ప్రారంభంకానున్న కొత్త బార్ల విషయంలోనైనా అధికారులు దృష్టి సారించకపోతే లూటీ తప్పదని, ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని మందుబాబులు కోరుతున్నారు.
నేడే లాటరీ
విజయనగరం క్రైం, ఆగస్టు 29 ( ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బార్ పాలసీ 2025-28 దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ ఈప్రక్రియ కొనసాగినట్టు జిల్లా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సూపరిండెంట్‌ంట్ బి.శ్రీనాథుడు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఓపెన్ కేటగిరీ బార్లకు 51 దరఖాస్తులు, గీత కులాలకు సంబంధించి మూడు బార్లకు 21 దరఖాస్తులు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఓపెన్ కేటగిరీ బార్‌కు 9 దరఖాస్తులు, గీత కులాల బార్‌కు 10 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ అంబేడ్కర్ సమక్షంలో శనివారం లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.