Roads are broken. రోడ్లు ఛిద్రం
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:54 PM
Roads are broken.భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిన్నాయి. 139 కిలోమీటర్ల మేర రహదారులు పాడైనట్లు రోడ్లు భవనాల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా వేశారు.
రోడ్లు ఛిద్రం
వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులు
ఇప్పటికే పాడైన చోట మరింత పెద్దగా గోతులు
వాటిపై ప్రయాణానికి అవస్థలు
తక్షణం బాగు చేయాలని అధికారులకు విన్నపాలు
మళ్లీ తుఫాన్ వస్తే మరింత దారుణంగా మారే ప్రమాదం
విజయనగరం/ గంట్యాడ/ కొత్తవలస, సెప్టెంబరు6(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిన్నాయి. 139 కిలోమీటర్ల మేర రహదారులు పాడైనట్లు రోడ్లు భవనాల శాఖ అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. ఆయా రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.4.30కోట్ల మేర అవసరమని ఆ శాఖాధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. వర్షాలకు పాడైన రోడ్లు ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేవు. పెద్ద, పెద్ద గోతులు పడిన చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళ ఆయా రోడ్లలో ప్రయాణం చాలా కష్టంగా మారింది. పూసపాటిరేగ మండలంలోని గుంపాం, భోగాపురం మండలంలోని రావాడ, సవరవల్లి రోడ్లు, బొబ్బిలి- తెర్లాం రహదారి, గజపతినగరం నుంచి మెంటాడకు వెళ్లే రహదారి, గజపతినగరం మండలం బగ్గాం నుంచి బంగారమ్మపేటకు వెళ్లే రహదారి చాలా దయనీయంగా మారాయి. విజయనగరంలోని పలు ఆర్‌అండ్‌బీ రోడ్లు కూడా వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రహదారుల్లో దెబ్బతిన్న కల్వర్టులు
గంట్యాడ మండలంలోని కొటారుబిల్లి కూడలి నుంచి సిరిపురం, మురపాక, పెదవేమలి, చంద్రంపేట, వసంత గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలో రెండు కల్వర్డులు పూర్తిగా మూసుకు పోయాయి. దీంతో పైనుంచి వస్తున్న వర్షపు నీరు ఈ కల్వర్టుల ద్వారా దిగువనున్న చెరువుల్లోకి వెళ్లడం లేదు. సిరిపురం ముందు ఉన్న కల్వర్టుకు పెద్ద రంధ్రం పడడంతో మట్టితో కప్పేశారు. దీంతో వర్షపు నీరు దిగువకు వెళ్లడం లేదు. భారీ వర్షం కురిస్తే రానున్న రోజుల్లో ఈరహదారి నుంచి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇదే జరిగితే దాదాపు 20 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందే.
- వైసీపీ హయాంలో రోడ్లపై గుంతలు పడినా అలాగే వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా వ్యాప్తంగా 856 కిలోమీటర్లలో గుంతలు పూడ్చడానికి దాదాపు రూ.23 కోట్లు ఇచ్చింది. దీంతో రోడ్లు కొంతవరకు బాగు పడ్డాయి కాని ఆయా రోడ్ల పరిధిలో ఉన్న కల్వర్టులు అలాగే ఉన్నాయి. బొబ్బిలి డివిజిన్ రాజాం పరిధిలో ఉన్న కల్వర్టులన్నీ చాలా వరకూ కుంగిపోయాయి.
ప్రధాన రహదారిలో అడుగుకో గొయ్యి
కొత్తవలస-విజయనగరం రహదారిలో అడుగుకో గొయ్యి కనిపిస్తోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొద్దినెలల కిందట రోడ్లకు మరమ్మతులు చేపట్టినప్పటికీ ఈ రహదారిలో పనులు చేయలేదు. కొత్తవలస- విజయనగరం రోడ్డులో మండల సరిహద్దు గ్రామమైన చినరావుపల్లి వరకు పరిస్థితి అధ్వానంగా ఉంది. చినరావుపల్లి వద్ద రైల్వేగేట్‌పై వేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద కూడా గోతులు పడడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
కాంతిమతి, ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ
వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పరిశీలించాం. వాటి మరమ్మతులకు అంచనాలు తయారు చేశాం. జిల్లా వ్యాప్తంగా 139 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్టు గుర్తించి రూ.4.30 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించాం. నిధులు రాగానే ప్రాధాన్యతా క్రమంలో మరమ్మతులు చేస్తాం.