ro plants not working పనిచేయని ప్లాంట్లు
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:13 AM
ro plants not working నెల్లిమర్ల మండలం మొయిద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాడైన ఆర్వో ప్లాంట్ ఇది. గత కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులకు తాగునీరు అందని ద్రాక్షగా మిగిలింది. నెల్లిమర్ల మండలంలో 72 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 11 చోట్ల ఆర్వో ప్లాంట్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
పనిచేయని ప్లాంట్లు
పాఠశాలల్లో మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు
పట్టించుకోని అధికారులు
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
నెల్లిమర్ల మండలం మొయిద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాడైన ఆర్వో ప్లాంట్ ఇది. గత కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులకు తాగునీరు అందని ద్రాక్షగా మిగిలింది. నెల్లిమర్ల మండలంలో 72 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 11 చోట్ల ఆర్వో ప్లాంట్లు పూర్తిగా పాడయ్యాయి. దీంతో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
నెల్లిమర్ల, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి):
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్లు ఎక్కడికక్కడే మూలకు చేరాయి. పనిచేస్తున్నవి తక్కువ.. చేయనివి ఎక్కువ అన్నట్టు ఉంది పరిస్థితి. అప్పట్లో నాడు-నేడు పథకంలో భాగంగా 841 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరయ్యాయి. 680 పాఠశాలల్లో మాత్రమే ఏర్పాటుచేశారు. ఇందుకుగాను రూ.183 కోట్లు ఖర్చుచేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రెండో విడతలో 738 పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లు మంజూరుకాగా.. రూ.231 కోట్లు ఖర్చుచేశారు. రెండు విడతల్లో కలిపి ఆర్వో ప్లాంట్ల నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చాలాచోట్ల అవి పనిచేయడం లేదు. దీంతో తాగునీటి కోసం విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చేతిపంపుతో పాటు కుళాయిల నీటిని తాగుతున్నారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బట్టి ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేశారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకూ ఖర్చుచేశారు. విద్యార్థులకు ఫ్లోరైడ్ నీటి బాధ నుంచి విముక్తి కల్పించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు గత ప్రభుత్వం ప్రకటించింది కానీ నిర్వహణ చూడలేకపోయింది. దీంతో రకరకాల కారణాలతో ప్లాంట్లు మూలకు చేరాయి. ఆహ్లాద ఇంజనీర్స్ లిమిటెడ్, ఇన్నోవేటివ్ ఇండస్ర్టీస్, లివ్‌ప్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి పలు కంపెనీల నుంచి ఆర్వో ప్లాంట్లను తెప్పించారు. అప్పట్లో సాంకేతిక సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. కాగా ప్రస్తుతం ప్లాంట్లు పనిచేయడం లేదని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు ఫోన్ చేస్తుంటే టెక్నికల్ సిబ్బంది స్పందించడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరముంది. లేకుంటే వందల కోట్ల రూపాయలు విలువచేసే ఆర్వో ప్లాంట్లు దేనికీ పనికిరాకుండా పోయే అవకాశం ఉంది.
----------------------