Share News

Irrigation a Struggle! చెంతనే నది ఉన్నా.. సాగునీటికి అవస్థే!

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:18 AM

“River at Their Doorstep… Yet Irrigation a Struggle! వంశధార నదీతీరాన భామిని మండలం ఉన్నా.. ఈ ప్రాంత రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఏటా వరుణుడిపైనే ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. వరదల సమయంలో భూములు కోతకు గురవుతుండగా.. వంశధార వరద కాలువలు మండల రైతులకు శాపంగా మారాయి.

  Irrigation a Struggle!   చెంతనే నది ఉన్నా.. సాగునీటికి అవస్థే!
వడ్డంగి లిప్ట్‌ ద్వారా నీరు మళ్లించాల్సిన గజపతిసాగరం

  • ఎత్తిపోతలకు ఎదురుచూపు

  • గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు

  • వైసీపీ హయాంలో మంగళం

  • కూటమి సర్కారుపైనే ఆశలు

భామిని, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వంశధార నదీతీరాన భామిని మండలం ఉన్నా.. ఈ ప్రాంత రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. ఏటా వరుణుడిపైనే ఆధారపడి సాగు చేపట్టాల్సి వస్తోంది. వరదల సమయంలో భూములు కోతకు గురవుతుండగా.. వంశధార వరద కాలువలు మండల రైతులకు శాపంగా మారాయి. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న గత టీడీపీ ప్రభుత్వం రెండు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసింది. దీంతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. అయితే అదే సమయంలో ఎన్నికలు జరగడం.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్‌ మారింది. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ గత ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో ఆ ప్రాంత రైతులకు సాగునీటి సమస్య తీరడం లేదు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కలగానే మిగిలింది. ప్రస్తుతం ఆయా ప్రాంతవాసులు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ పరిస్థితి..

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నేరడి బ్యారేజీ సమీపంలో రూ.33 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. వడ్డంగి గ్రామ సమీపంలో గజపతిసాగరానికి వంశధార నది నీటిని మళ్లించాలనిప్రణాళికలు రూపొందించారు. అక్కడ నుంచి లోహరజోల ఊర చెరువు, వడ్డంగి నల్లచెరువు, కరగాన చెరువు, బొమ్మిక ఎర్ర చెరువు, నులకజోడు, మామిడి చెరువుకు అను సంధానం చేయడం ద్వారా సుమారు ఏడు వేల ఎకరాలు సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అధికారులు రంగంలోకి దిగారు.

- కాట్రగడ వద్ద రూ.18 కోట్లతో మరో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. అక్కడ నుంచి మనుమకొండ వెర్రిగెడ్డకు వంశధార నీరు మళ్లిస్తే బత్తిలి, కాట్రగడ వద్ద మరో వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశించారు. ఇక పనులు చేపడతారనుకున్న సమయంలో ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వ తీరుతో వాటి నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. గత ఐదేళ్లూ ఆయా ఎత్తిపోతలను పట్టించుకునే వారే కరువయ్యారు.

మూలకు చేరిన మరో పథకం

ఎన్నో ఏళ్ల కిందట నేరడి సమీపంలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం మూలకు చేరింది. జలయజ్ఞంలో భాగంగా వంశధార వరద కాలువ పనులు ప్రారంభించడంతో ఇది పనికిరాకుండా పోయింది. దీనిని పునరుద్ధరిస్తే గురండి, నేరడి గ్రామాల్లోని సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

పూర్తిస్థాయిలో నీరివ్వాలి..

గతంలో మంజూరైన ఎత్తిపోతల పథకాల పనులు ప్రారంభించాలి. పూర్తిస్థాయిలో భూములకు సాగునీరు ఇవ్వాలి. అప్పుడు ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. దీనిపై అధికారులు స్పందించాలి.

- వి.శేషగిరినాయుడు, రైతు, వడ్డంగి

=========================

ఎత్తిపోతలే ఆధారం..

ఎత్తిపోతల పథకం ద్వారా వడ్డంగి గజపతి సాగరానికి వంశధార నది నీరు మళ్లిస్తే.. నులకజోడు మామిడి చెరువుకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతంలో సాగునీటి కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం మాకున్న భూములకు ఎత్తిపోతల పథకమే ఆధారం.

- భూపతి ప్రభాకరరావు, రైతు, నులకజోడు

==========================

అంచనాలు రూపొందిస్తున్నాం

మండలంలో ఎత్తిపోతల పథకాలకు తిరిగి అంచనాలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతానికి నేరడిలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతాం.

- కామరాజు, డీఈ, లిఫ్ట్‌ ఇరిగేషన్‌

Updated Date - Nov 23 , 2025 | 12:18 AM