Share News

Boat Journey ప్రమాదమైనా.. తప్పని పడవ ప్రయాణం

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:15 PM

Risky Yet Unavoidable Boat Journey ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తుండడంతో భామిని మండల పరిధిలోని వంశధారకి వరద పోటెత్తుతోంది. నదిలో స్వల్పంగా నీటి నిల్వలు పెరిగాయి. దీంతో నదిలో దిగి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఆంధ్రా, ఒడిశా నదీతీర గ్రామాలు ప్రజలు పడవను ఆశ్రయిస్తున్నారు.

 Boat Journey ప్రమాదమైనా..  తప్పని పడవ ప్రయాణం
నేరడి వంశధార రేవులో పడవపై ప్రయాణిస్తున్న గ్రామస్థులు

  • ఆంధ్రా-ఒడిశా గ్రామస్థులకు ఇబ్బందులు

భామిని, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతం ఒడిశాతో పాటు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తుండడంతో భామిని మండల పరిధిలోని వంశధారకి వరద పోటెత్తుతోంది. నదిలో స్వల్పంగా నీటి నిల్వలు పెరిగాయి. దీంతో నదిలో దిగి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఆంధ్రా, ఒడిశా నదీతీర గ్రామాలు ప్రజలు పడవను ఆశ్రయిస్తున్నారు. నేరడి గురండి, బిల్లుమడ, సింగిడి, వడ్డంగి, లోహజోల తదితర గ్రామస్థులు నేరడి తీరం పడవ ఎక్కి నది అవతల ఉన్న ఒడిశా గ్రామాలకు వెళ్తున్నారు. అదేవిధంగా ఒడిశా గ్రామాలైన ఖండవ, పురిటిగూడ, గౌరి గ్రామస్థులు అదే పడవపై తిరిగి ఆంధ్రా వైపు వస్తున్నారు. గుణుపూర్‌, పూరి, విశాఖ రైళ్ల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన వారు కూడా ఇదే విధంగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వేసవిలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఏటా వర్షాకాలంలో మాత్రం అవస్థలు తప్పడం లేదు. వాస్తవంగా నేరడి రేవు నుంచి మూడు నుంచి ఐదు కిలోమీటర్లు పడవలో ప్రయాణిస్తే ఆంధ్రా-ఒడిశా గ్రామాలకు చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం అయితే కొత్తూరు, బత్తిలి మీదుగా 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. రవాణా ఖర్చుతో పాటు సమయం కూడా వృథా అవుతుంది. దీంతో పడవ ప్రయాణం వైపే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. అయితే గతంలో ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో కొంతమంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలకే పరిమితమైన నేరడీ బ్యారేజీని నిర్మిస్తే ఆంధ్రా-ఒడిశా వాసులకు కష్టాలు తప్పుతాయని ఆయా ప్రాంతవాసులు చెబుతున్నారు. దీనిపై ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:15 PM