Rising pollution కమ్మేస్తున్న కాలుష్యం
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:50 PM
Rising pollution నగర, పట్టణాల్లో వాయు కాలుష్యం హెచ్చుతోంది. విస్తృతంగా పెరుగుతున్న వాహన వినియోగం, ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్ తదితర వాటి నుంచి విడుదలయ్యే వాయువులు, ప్లాస్టిక్.. ఇతర వ్యర్థాలు, కాలం చెల్లిన వాహనాలు, రోడ్లుపై పోగుబడే దూళి తదితర అంశాలు వాయు కాలుష్యం పెరగడానికి ప్రఽధాన కారణాలుగా ఉన్నాయి.
కమ్మేస్తున్న కాలుష్యం
జిల్లాలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం
నగరాలు, పట్టణాల్లో మరింత
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక
స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం అమలు
విజయనగరం రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
నగర, పట్టణాల్లో వాయు కాలుష్యం హెచ్చుతోంది. విస్తృతంగా పెరుగుతున్న వాహన వినియోగం, ఇళ్లలో ఏసీ, ఫ్రిజ్ తదితర వాటి నుంచి విడుదలయ్యే వాయువులు, ప్లాస్టిక్.. ఇతర వ్యర్థాలు, కాలం చెల్లిన వాహనాలు, రోడ్లుపై పోగుబడే దూళి తదితర అంశాలు వాయు కాలుష్యం పెరగడానికి ప్రఽధాన కారణాలుగా ఉన్నాయి. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు బొబ్బిలి, రాజాం మునిసిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలే కాదు ఓ మాదిరి పట్టణాలుగా పేరొందిన అన్నిచోట్లా కాలుష్యం పోగుబడుతోంది.
విజయనగరం నగరపాలక సంస్థను తీసుకుంటే ప్రతిరోజూ 125 టన్నుల చెత్త ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుంచి వస్తోంది. అదే విధంగా బొబ్బిలి మునిసిపాలిటీ నుంచి ప్రతి రోజు 40 నుంచి 50 టన్నుల మధ్య చెత్త సేకరిస్తున్నారు. రాజాం, నెల్లిమర్లలో 10 నుంచి 20 టన్నుల చెత్త వస్తోంది. దీనిని పారిశుధ్య సిబ్బంది డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఈ సమయంలో కూడా నగరపాలక సంస్థ అఽధికారులు, మునిసిపల్, నగర పంచాయతీ అధికారులు నిబంధనలు పాటించడం లేదు. చెత్త ఎగరకుండా కనీసం టార్పాన్లు వేయడం లేదు. లేదంటే చెత్త తరలించే వాహనానికి జాలు వేసి గాల్లో ఎగరకుండా చూడాలి. అదీ చేయక చెత్త, ఇతర వ్యర్థాల నుంచి కాలుష్యం వెదజల్లుతోంది. మరోవైపు కొత్త వాహనాల వాడకం విస్తృతంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా వాహనాల కొనుగోళ్లు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి. మరోవైపు 15 ఏళ్లు దాటిన వాహనాలు లేకుండా చూడాలి. లేదంటే ఆ వాహనాలు కాలుష్య నియంత్రణ పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ రెండు ప్రక్రియలు జరగడం లేదు. చాలా వాహనాలు 20 ఏళ్లు దాటినా యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. వారు ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం లేదు. పోలీసులు గుర్తించడం లేదు. తనిఖీలు చేసేటప్పుడు వాహనదారులు దూరం నుంచి గుర్తించి ఆగిపోవడం, వేరే మార్గంలో వెళ్లిపోవడం చేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం వెదజల్లే వాహనాల కట్టడి జరగడం లేదు. మరోవైపు జిల్లాలో చాలా రోడ్లు అధ్వానంగా మారాయి. వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ఆ వైపుగా చర్యలు లేక వాటిపై గుంతలు పెద్దవిగా మారి, దూళి పైకి చేరి వాయుకాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి.
కట్టడి చేసేందుకు ప్రణాళికతో అడుగులు
పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొద్ది నెలల కిందట అధికారులతో సర్వే చేసి ఏ నెలలో వాయు కాలుష్యం ఏ మేర ఉందనేదానిపై ప్రాంతాల వారీగా నివేదికను తీసుకుంది. ఆపై కట్టడి చేసేందుకు నగరపాలక, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఆదేశాలు ఇచ్చింది. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెలా మూడో వారాన్ని నిర్వహించడమే కాకుండా, కాలుష్యం తగ్గేంచేందుకు వీలుగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నది. కొత్త రోడ్లు ఏర్పాటు, రోడ్లకు మరమ్మతులు, అదే విధంగా పారిశుధ్య వాహనాల కొనుగోలు, చెత్త తరలించే సందర్భంగా తగిన జాగ్రత్తలు తదితర చర్యలకు ఆదేశించింది. ఇవన్నీ పక్కాగా అమలైతే కొంత ఉపశమనం లభిస్తుంది. వాయు కాలుష్యాన్ని మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ (ఎంకెఎం) పద్ధతుల్లో లెక్కకడతారు. విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం తదితర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిమాణం కంటే వాయు కాలుష్యం క్రమేణా పెరుగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నది.
------------------------------