Share News

Revenue Clinic రెవెన్యూ క్లినిక్‌.. ఇక రాష్ట్రమంతా!

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:21 AM

Revenue Clinics to Expand Across the State! జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ను ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.జయలక్ష్మి జీవో విడుదల చేశారు.

Revenue Clinic రెవెన్యూ క్లినిక్‌.. ఇక రాష్ట్రమంతా!
కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌కు హాజరైన అర్జీదారులు (ఫైల్‌)

  • అన్ని జిల్లాల్లో అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

  • రెవెన్యూ డెస్క్‌ పేరిట ఏర్పాటుకు చర్యలు

పార్వతీపురం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ను ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.జయలక్ష్మి జీవో విడుదల చేశారు. వాస్తవంగా జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ప్రయోగాత్మకంగా రెవెన్యూ క్లినిక్‌కు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. భూ తగాదాలు, ఇతరత్రా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి అర్జీదారులకు ఊరట కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదేశాలతో రెవెన్యూశాఖ కదిలింది. పౌరుల పిటిషన్లకు పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే లక్ష్యంతో ప్రతి జిల్లా కలెక్టరేట్‌ పరిధిలో రెవెన్యూ డెస్క్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీన్ని స్పెషల్‌ రెవెన్యూ డెస్క్‌గా పరిగణిస్తారు. ప్రతి సోమవారం వచ్చే అర్జీలతోపాటు, సాధారణంగా కలెక్టరేట్‌కు వచ్చే విన్నపాలను కూడా ఈ డెస్క్‌ పర్యవేక్షిస్తుంది. ప్రతి అర్జీకీఓ ఆన్‌లైన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఆ అర్జీపై దరఖాస్తుదారు ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. పౌరుల నుంచి వచ్చే అర్జీలు డెస్క్‌ తీసుకున్నాక దాని పరిష్కారం ఎలా ఉంటుందో తెలిపే కార్యాచరణ కు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీని దరఖాస్తు దారుకు అందించనున్నారు. దీని వల్ల తన సమస్య తీవ్రత ఏమిటి....ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందన్నది ఆ కాపీలో ఉంటుంది. దానిపై డిప్యూటీ కలెక్టరు సంతకం చేస్తారు. తొలుత డెస్క్‌ లెవెల్‌లో అర్జీని పరిశీలించిన తర్వాత సంబంధిత తహసీల్దార్‌కు దానిని పంపిస్తారు. ఫీల్డ్‌ వెరిఫికేషన్‌, సీనియర్‌ అధికారుల సమీక్షతో పాటు ఆ సమస్యను పరిష్కరిస్తారు. అనంతరం సమస్య పరిష్కారంపై ఐవీఆర్‌ఎస్‌ ద్వారా అర్జీదారుల అభిప్రాయాలను సేకరిస్తారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నారు.

‘రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లు అమలు చేయాలని ప్రభుత్వం జీవో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికే ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ.. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా..’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 27 , 2025 | 12:21 AM