Share News

Collectorate కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:19 PM

Revenue Clinic at the Collectorate జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ క్లినిక్‌ ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఒక కౌంటర్‌ ఏర్పాటు చేసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.

 Collectorate కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌
రెవెన్యూ క్లినిక్‌లో అర్జీదారులు నుంచి వినతులు స్వీకరిస్తున్న అధికారులు

  • రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో ఏర్పాటు

పార్వతీపురం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ప్రయోగాత్మకంగా రెవెన్యూ క్లినిక్‌ ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఒక కౌంటర్‌ ఏర్పాటు చేసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి స్వయంగా అర్జీదారులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భూ విస్తీర్ణంపై స్పందించాలని బలిజిపేటకు చెందిన ఎం.తవుడమ్మ వినతిపత్రం అందించారు. పట్టా సబ్‌ డివిజన్‌పై కొమరాడ మండలం పరశురాంపురం గ్రామానికి చెందిన జి.భారతి, వీరఘట్టం మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన జి.కన్నయ్య అర్జీ ఇచ్చారు. మొత్తంగా సాయంత్రానికి వివిధ కౌంటర్ల ద్వారా సుమారు 40 వరకు అర్జీలు రాగా వాటిపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ చర్చించారు. రెవెన్యూ క్లినిక్‌కు వచ్చే సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకుని.. వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకో వాలని పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ను ఆదేశించారు. పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా జిల్లాలో రెవెన్యూ సమస్యలెన్నో ఉన్నాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతులే ఇందుకు నిదర్శనం. వాటిని సకాలంలో పరిష్కరిస్తే రైతులతో పాటు సామాన్యులకు ఎంతో మేలు కలగనుంది. కాగా గత వైసీపీ సర్కారు పాలనలో జిల్లాలో జరిగిన రీసర్వే తప్పులు తడకలుగా మారింది. దీంతో కొన్నేళ్లుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భూ ఆక్రమణలు, జిరాయితీ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు, సాగు భూములకు పట్టాలు మంజూరు, అడంగల్‌, పట్టాదారు పాస్‌పుస్తకాల్లో పేర్ల మార్పు తదితర సమస్యలపై ఎంతోమంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతివారం అర్జీలు అందిస్తున్నారు. అయితే దీర్ఘకాలికంగా వేధిస్తున్న పై సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్‌లో ప్రత్యేక రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - Sep 29 , 2025 | 11:19 PM