Share News

After 20 Years 20 ఏళ్ల తర్వాత కలిశారు

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:55 PM

Reunited After 20 Years జిల్లాకు చెందిన కొండగొర్రె చుక్క అలియాస్‌ కోనేరు అప్పారావు ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడు తనవారి చెంతకు చేరాడు. దీంతో కుటుంబీకుల నిరీక్షణకు తెరపడింది.

  After 20 Years 20 ఏళ్ల తర్వాత కలిశారు
అప్పారావుకు నూతన వస్ర్తాలు అందిస్తున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

ఉపాధి కోసం వెళ్లి తప్పిపోయిన వైనం

ఎట్టకేలకు జిల్లాకు చేరిన వృద్ధుడు

పార్వతీపురం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన కొండగొర్రె చుక్క అలియాస్‌ కోనేరు అప్పారావు ఎట్టకేలకు కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడు తనవారి చెంతకు చేరాడు. దీంతో కుటుంబీకుల నిరీక్షణకు తెరపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా బంధుగాం బ్లాక్‌ చినవల్లాడ గ్రామానికి చెందిన జాతాపు ఆదివాసి అప్పారావు 20 ఏళ్ల కిందట ఉపాధి కోసం తన స్నేహితులతో కలిసి పాండిచ్చేరికి వలస వెళ్లాడు. అయితే మధ్యలో టీ తాగడానికి అప్పారావు దిగిపోగా.. రైలు వెళ్లిపోయింది. దీంతో ఎటు వెళ్లాలో తెలియక ఆయన అక్కడే ఉండిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు అప్పారావు ఆచూకీ తెలియలేదు. కాగా ఈ ఏడాది జనవరి 31న తమిళనాడులోని శివగంగ జిల్లా కదంబకళంలో కార్మిక శాఖ అధికారులు నిర్వహించిన పరిశీలనలో అప్పారావు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గొర్రెల కాపలాదారుడిగా వెట్టిచాకిరీ చేస్తున్నట్లు గుర్తించారు. తనది పార్వతీపురం అని చెప్పడంతో జిల్లా కలెక్టర్‌కు వారు సమాచారం అందించారు. మరోవైపు ఈ విషయం సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వైరల్‌ అయ్యింది. ఈనెల 11న అప్పారావు చుక్క కుటుంబ ఆచూకీ లభ్యమైంది. కాగా సోషల్‌ మీడియాలో ప్రసారమైన అప్పారావు ఫొటోను చూసి తన తండ్రిగా సాయమ్మ గుర్తించింది. పార్వతీపురం మండలం ములక్కాయవలసలో ఉంటున్న ఆమె తన భర్త డుంబుదొర చందుతో కలిసి ఇటీవల కలెక్టరేట్‌కు చేరుకుంది. వెంటనే తన తండ్రిని పార్వతీపురం రప్పించాలని వేడుకుంది. దీనిపై స్పందించిన కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అప్పారావు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నీ నిర్ధారించుకున్న అనంతరం తమిళనాడు శివగంగ కలెక్టర్‌తో మాట్లాడారు. మన్యం జిల్లా నుంచి పార్వతీపురం ఉప తహశీల్దార్‌ కిరీటి, సహాయ కార్మిక అధికారి సీహెచ్‌. వెంకటేశ్వరరావు, చుక్క కుమార్తె, అల్లుడిని ప్రత్యేక వాహనంలో ఆ ప్రాంతానికి పంపించారు. అక్కడ అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్న వారు ఆదివారం ఉదయం పార్వతీపురం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, డీఆర్వో కె.హేమలత తదితరులు అప్పారావుకు ఆహ్వానం పలికి కుటుంబ సభ్యులు అప్పగించారు. ఆయన ఆరోగ్యం, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాండెడ్‌ లేబర్‌ చట్టం కింద తమిళనాడు ప్రభుత్వం అందించిన రూ.2 లక్షల చెక్కు, రూ.30 వేలు నగదును జమ చేసిన బ్యాంకు ఖాతా బుక్‌ను కలెక్టర్‌ ఆయనకు అందించారు. ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తక్షణమే ఆధార్‌ కార్డు వచ్చే విధంగా చూస్తా మన్నారు. జీవనానికి అవసరమైన గొర్రెల పెంపకం యూనిట్‌, గృహం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆ వృద్ధుడికి కలెక్టర్‌ నూతన వస్ర్తాలు అందించారు. ఏదేమైనా ఇన్నేళ్ల తర్వాత కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉందని అప్పారావు తెలిపాడు.

ఉపాధి లేక వలస బాటలో...

స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక జిల్లాలో ఎంతోమంది వలసబాట పడుతున్నారు. కుటుంబాలను వదిలి.. పొట్టచేతపట్టుకుని ఇతర రాష్ర్టాలకు పయనమవుతున్నారు. అయితే ఇలా వెళ్తున్న గిరిజనుల్లో అత్యధికులు నిరక్షరాస్యత, అమాయకత్వం కారణంగా ఆయా ప్రాంతాల్లో వెట్టిచాకిరీకి గురవుతున్నారు. అప్పారావులా ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది ఎలాగోలా నెట్టుకొస్తుంటే మరికొంతమంది భాష తెలియని రాష్ర్టాల్లో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. అక్కడ ఉండలేక.. ఇక్కడకు రాలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇటువంటి వారిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

కంటికి రెప్పలా చూసుకుంటా...

20 ఏళ్ల కిందట నా తండ్రి ఉపాధి కోసమని వలస వెళ్లి తప్పిపోయారు. ఆ బెంగతో నా తల్లి మృతి చెందింది. ఇప్పటికైనా నా తండ్రి నా దగ్గరకు రావడం ఆనందంగా ఉంది. ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటా. ఈ విషయంలో కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ కృషి మరువలేనిది. ఏదేమైనా నా తండ్రి లాంటి కష్టం మరొకరికి రాకూడదు.

- సాయమ్మ, అప్పారావు కుమార్తె

========================

సంతోషంగా ఉంది

ఎన్నో ఏళ్ల తర్వాత అప్పారావును కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయంలో సహకరించిన శివగంగ జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులతో అప్పారావును చూసినప్పుడు ఆయన కళ్లల్లో ఆనందం గమనించాను.

- శ్యామ్‌ ప్రసాద్‌, కలెక్టర్‌, పార్వతీపురం మన్యం

Updated Date - Mar 16 , 2025 | 10:55 PM