Re-survey ఆ 46 ఇళ్లకు రీసర్వే
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:54 PM
Re-survey for Those 46 Houses భామిని మండలంలోని 46 ఇళ్ల విస్తీర్ణం నమోదు, పన్నుల్లో తేడా కనిపించడంతో అధికారులు రీ సర్వేకు ఉపక్రమించారు. ఈ మేరకు మంగళవారం డీపీవో కొండలరావు ఆధ్వర్యంలో కొరమలో 36 ఇళ్ల కొలతలు తీసుకున్నారు.
క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వాకంతో తిప్పలు
భామిని, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భామిని మండలంలోని 46 ఇళ్ల విస్తీర్ణం నమోదు, పన్నుల్లో తేడా కనిపించడంతో అధికారులు రీ సర్వేకు ఉపక్రమించారు. ఈ మేరకు మంగళవారం డీపీవో కొండలరావు ఆధ్వర్యంలో కొరమలో 36 ఇళ్ల కొలతలు తీసుకున్నారు. పొడవు, వెడల్పులను కొలిచి.. వాటి వాస్తవ విస్తీర్ణాన్ని నమోదు చేశారు. ఏడాది కిందట సచివాలయం సిబ్బంది మండలంలో 11,287 ఇళ్లను సర్వే చేశారు. అయితే కొన్ని ఇళ్ల పొడవు, వెడల్పులను ఎక్కువగా చూపి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో ఆయా ఇళ్ల పన్నులు భారీ మొత్తంలో వస్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు పీఆర్ కమిషనర్‌కు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం రీ సర్వే చేస్తున్నారు. ఈ నివేదికలను పైఅధికారులకు పంపించనున్నారు. అయితే ఆన్‌లైన్‌లో ఆయా ఇళ్ల విస్తీర్ణాలను సవరించడం అంత తేలికైన పనికాదనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కాగా ఈ రీసర్వేలో పాలకొండ డీఎల్‌పీవో జె.రాంప్రసాద్‌రావు, డిప్యూటీ ఎంపీడీవో ఏ.జగన్నాథరావు, పంచాయతీ కార్యదర్శి కె.బాలాకుమారి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్థి పఽథంలో నడిపించాలి
సీతంపేట రూరల్: గ్రామ పంచాయతీలను అభివృద్థి పథంలో నడిపించాలని డీపీవో కొండలరావు అన్నారు. మంగళవారం సీతంపేట పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇంటి పన్ను, ప్యూరిఫికేషన్, చెత్త సేకరణ వంటి అంశాలపై పంచాయతీ పరిపాలనపై అధికారులతో సమీక్షించారు. ఇంటిపన్ను మదింపు ప్రక్రియపై తగు సూచనలిచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో సత్యం, కార్యదర్శి రామకృష్ణ తదితరులు ఉన్నారు.