ration : రేషన్ బాధ్యత మళ్లీ గిరిజన సహకార సంస్థకే
ABN , Publish Date - May 24 , 2025 | 12:16 AM
ration : జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రేషన్ పంపిణీ బాధ్యతను మళ్లీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కే అప్పగించారు.
- గిరిజన ప్రాంతాల్లో సరుకులు అందించనున్న జీసీసీ
- జిల్లాలో 150 డీఆర్ డిపోలు
గుమ్మలక్ష్మీపురం, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రేషన్ పంపిణీ బాధ్యతను మళ్లీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కే అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (రేషన్ వాహనాలు) వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో గిరిజన గ్రామాల్లో రేషన్ పంపిణీ బాధ్యతను జీసీసీ డీఆర్ డిపోలకు అప్పగించారు. జూన్ నుంచి రేషన్‌కార్డుదారులు పాతపద్ధతిలో డీఆర్ డిపోలకు వెళ్లి రేషన్ తీసుకోవాల్సి ఉంది. పార్వతీపురం డివిజన్ పరిధిలో గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురంలో జీసీసీ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ బ్రాంచ్‌ల పరిధిలో సుమారు 150 వరకు డీఆర్ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల్లోని సేల్స్‌మెన్ల ద్వారా నిత్యావసర సరుకులతో పాటు రేషన్ పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో డీఆర్ డిపోల ద్వారా గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, మక్కువ, సాలూరు, పాచిపెంట, సీతంపేట, మండల్లాలోని గిరిజనులకు రేషన్ సరుకులు ఇచ్చేవారు. వీటితో పాటుగా నిత్యావసరాల అమ్మకాల బాధ్యత, అటవీ ఫలసాయాలు కొనుగోలు డీఆర్ డిపోల ద్వారా నిర్వహించేవారు. అయితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత డీఆర్ డిపోలు నిర్వీర్యమయ్యాయి. ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడంతో డిపోల భవనాలు మరమ్మతులకు గురయ్యాయి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ డిపోల ద్వారా రేషన్ ఇవ్వనందున ఆ భవనాలను బాగు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఈవిషయమై గుమ్మలక్ష్మీపురం జీసీసీ మేనేజర్ ఎస్.రామును వివరణ కోరగా.. ‘జూన్ 1 నుంచి డీఆర్ డిపోల ద్వారా రేషన్ పంపిణీ చేస్తాం. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏర్పాట్లు చేస్తున్నాం’.అని తెలిపారు.