Share News

Respite for Wage Earners వేతనదారులకు ఊరట

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:49 PM

Respite for Wage Earners జిల్లాలో ఉపాధి వేతనదారులకు ఊరట లభించింది. ఎనిమిది వారాలకు సంబంధించి వేతనాలు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Respite for Wage Earners వేతనదారులకు ఊరట
పనుల్లో ఉపాధి వేతనదారులు (ఫైల్‌)

  • అభివృద్ధి పనులకు రూ.35 కోట్లే విడుదల

  • ప్రాధాన్య క్రమంలో చెల్లింపులకు చర్యలు

పార్వతీపురం/గరుగుబిల్లి, జూన్‌14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి వేతనదారులకు ఊరట లభించింది. ఎనిమిది వారాలకు సంబంధించి వేతనాలు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా 15 మండలాల పరిధిలోని 450 పంచాయతీలో సుమారు 4 లక్షలకు పైగా కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. అయితే వారికి ఫిబ్రవరి నుంచి వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వేతనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 176.35 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి వేతనదారులకు సుమారు రూ. 89.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే మే నెల వరకు ఉన్న వేతన బకాయిలను చెల్లిస్తున్నారు. ఈ నెలకు సంబంధించి కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. బిల్లులన్నీ పెండింగ్‌లో ఉండడంతో నిర్మాణాలపై ఆ ప్రభావం పడుతోంది. మెటీరియల్‌ కాంపోనెంట్‌లో భాగంగా గత ఏడాది డిసెంబరు నుంచి చేపడుతున్న పనులకు బిల్లులు చెల్లించడం లేదు. కాగా ఇటీవల జిల్లాకు రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో గోశాలలకు ప్రాధాన్యం ఇస్తూ సుమారు రూ.8 కోట్లు మంజూరు చేశారు. మిగిలిన రూ. 27 కోట్లను ఈ నెల 16 నుంచి పెండింగ్‌ బిల్లుల తేదీలను బట్టీ చెల్లించనున్నారు.

వేతనాలు చెల్లిస్తున్నాం..

ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులకు రూ.35 కోట్లు మంజూరైంది. నిబంధనల ప్రకారం బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. ప్రస్తుతం వేతనాలు చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నాం.

- కె.రామచంద్రరావు, పీడీ, డ్వామా

Updated Date - Jun 14 , 2025 | 11:49 PM