Land Issues భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా..!
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:32 PM
Resolving Land Issues is the Main Objective..! జిల్లాలో మూడో విడత భూముల రీ సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన 43 గ్రామాల్లో ప్రక్రియ చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 175 రోజుల్లో రీ సర్వే పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా భూ సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతతో సర్వే చేపడుతున్నారు.
43 గ్రామాల్లో కొనసాగనున్న ప్రక్రియ
175 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశం
జియ్యమ్మవలస, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత భూముల రీ సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన 43 గ్రామాల్లో ప్రక్రియ చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 175 రోజుల్లో రీ సర్వే పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా భూ సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతతో సర్వే చేపడుతున్నారు. వాస్తవంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నాడు చేపట్టిన రీ సర్వే ఫలితంగా భూ రికార్డులు తప్పులు తడకలగా మారాయి. గత ప్రభుత్వం జాయింట్ ఎల్‌పీఎంలు ఇవ్వడంతో అత్యవసర సమయాల్లో భూములను అమ్ముకోవాలన్నా, తనఖా పెట్టాలన్నా వీలు కావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతులకు తమ భూములపై పూర్తిస్థాయి హక్కు లేని పరిస్థితి. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల సమస్యలపై దృష్టి సారించింది. ప్రధానంగా జాయింట్ ఎల్‌పీఎంలు, భూ రికార్డులపై వారి నుంచి ఫిర్యాదులు రావడంతో రీసర్వే చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఇప్పటికే జిల్లాలో రెండు విడతల భూ రీసర్వే పూర్తయింది. ఒక పైలట్ ప్రాజెక్టు రీసర్వే కూడా అఽధకారులు పూర్తి చేశారు. తాజాగా మూడో విడత ప్రక్రియ ప్రారంభించారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలోని 965 గ్రామాల్లో 5,80,927.32 ఎకరాల్లో రీ సర్వే చేయాల్సి ఉంది. అయితే ముందుగానే 317 గ్రామాల్లో 1,81,895.92 ఎకరాల్లో రీ సర్వే పూర్తి చేశారు. ఆ తరువాత పైలట్ ప్రాజెక్టుగా 15 గ్రామాలను ఎంపిక చేసి 8914.62 ఎకరాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. ఇందుకోసం 36 టీములు పనిచేశాయి. రెండో విడతగా 30 గ్రామాల పరిధిలోని 27,542.23 ఎకరాల్లో 108 టీములు రీసర్వే చేశాయి.
- జిల్లాలో సర్వే శాఖ సిగ్నల్ ఉన్న గ్రామాలు 282 ఉన్నాయి. వీటి పరిధిలో 2,29,773.57 ఎకరాలు ఉన్నాయి. కాగా వాటిల్లో 43 గ్రామాల్లోని 27,379.97 ఎకరాలు మూడో విడత రీసర్వే చేపడుతున్నారు. ఇందుకోసం 73 టీములు పనిచేస్తున్నాయి. సర్వే , రెవెన్యూ శాఖల సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జిల్లాలో ఇంకా 239 గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది. ఇవి కాకుండా సిగ్నల్స్ లేని 307 గ్రామాల్లో 92,591.67 ఎకరాల్లో కూడా రీ సర్వే చేయాల్సి ఉంది.
- ఈ నెల 3న మూడో విడత రీ సర్వే ప్రారంభమవగా.. డిసెంబరు 16 వరకు గ్రౌండ్ ట్రూతింగ్, ధర నిర్ధారణ చేయనున్నారు. డిసెంబరు 17 నుంచి 26 వరకు అసైనింగ్ ఎల్‌పీఎం నెంబర్లు, వాటి కరెక్షన్లు చేయనున్నారు. ఇలా 2026 మార్చి 26 వరకు మూడోవిడత రీసర్వే కొనసాగుతుందని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు.
పక్కా ప్రణాళికతో..
రీ సర్వే తరువాత ఎక్కడా విమర్శలకు తావివ్వరాదని, కచ్చితమైన రికార్డులు తయారు చేయడంతో పాటు రైతులకు భూసమస్య ఉండరాదన్నది ప్రభుత్వ నిర్ణయం. ఈ మేరకు మూడో విడత రీసర్వే కచ్చితంగా చేస్తున్నాం. దీనిపై క్షేత్రస్థాయిలో సిబ్బందికి పలు సూచనలిచ్చాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పక్కా ప్రణాళికతో రీ సర్వే జరిగేటట్లు చర్యలు తీసుకుంటున్నాం. స్పష్టమైన సమాచారంతో రైతులు కూడా సహకరించాలి.
- లక్ష్మణరావు, డీఎస్‌ఎల్‌వో, జిల్లా సర్వేయింగ్ శాఖ