Resolving Issues సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:06 PM
Resolving Issues Is the Goal అంగన్‌వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం పార్వతీపురంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జీ నెట్‌వర్క్‌తో కూడిన 2,169 సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు సెల్‌ఫోన్ల పంపిణీ
పార్వతీపురం, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రం పార్వతీపురంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జీ నెట్‌వర్క్‌తో కూడిన 2,169 సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 58 వేల సెల్‌ఫోన్లు అంద జేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.75 కోట్లు వెచ్చించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్ వాడీల సమస్యలను పెద్దఎత్తున పరిష్కరించింది. గాడ్ర్యూటీ అమలు చేస్తున్నాం. చనిపోయిన వారికి మట్టి ఖర్చులు అందిస్తున్నాం. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన సెంటర్లుగా మార్చాం. కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నిధులు మంజూరు చేస్తున్నాం. మరుగుదొడ్డితో పాటు తాగునీరు వసతికి చర్యలు చేపడుతున్నాం. చిన్నారుల కోసం ప్రతి కేంద్రానికి ఆటబొమ్మలు, టీవీ అందిస్తున్నాం. అంగన్‌వాడీ సిబ్బందిని ఎంతో గౌరవంగా చూసుకుంటున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రస్తుతం యూనిఫారాలతో పాటు నాణ్యమైన వంట పాత్రలు , కరెంట్ స్టవ్ అందిస్తున్నారు. గతంలో ఉన్న అనేక యాప్‌ల బెడద నుంచి తప్పించారు. సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వానికి అంగన్‌వాడీలు ఎల్లప్పుడూ సహక రించాలి. ఎవరి మాటలో విని ధర్నాలు చేయడం తగదు. గత వైసీపీ హయాంలో అంగన్‌వాడీలు నిరసన కార్యక్రమాలు చేపడితే.. కేంద్రాల తాళాలు పగులకొట్టి నిర్వహణ బాధ్యత మరొకరికి ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు మూడు రోజులు ముచ్చటగానే మారాయి.’ అని తెలిపారు.
జీతాల పెంపుపై సీఎంతో చర్చిస్తా..
‘అంగన్‌వాడీల జీతాలు పెంపు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తా. జీతాలు పెంచిన తర్వాత సంక్షేమ పథకాలు కోరితే నిబంధనలు అంగీకరించవు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. గతంలో మూడుసార్లు జీతాలు పెంచింది చంద్రబాబునాయుడే. ఈసారి కూడా జీతాలు పెంచుతారు. జిల్లాలో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి నాతో చెప్పుకోవచ్చు.’ అని మంత్రి స్పష్టం చేశారు.
స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలి
అనంతరం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో సరికొత్త దృక్పథం అమలులోకి వచ్చింది. కేవలం భోజనం, గుడ్డు వంటివి అందిస్తే సరిపోదు. పిల్లలు, టీచర్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. హ్యాపీడే కార్యక్రమం ఉపాధ్యాయులు, పిల్లలు మధ్య దూరం తగ్గించడానికి దోహదపడుతుంది.’ అని తెలిపారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వైశాలి శనివారం హ్యాపీడే అంటూ స్టెప్పులేసి అందర్నీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తోయక తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అంగన్‌వాడీ సంఘం ప్రతినిధి జ్యోతి , కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట్‌నాయుడు , ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, టీడీపీ పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.