Relocation in Broad Daylight! పట్టపగలే తరలింపు!
ABN , Publish Date - May 25 , 2025 | 11:20 PM
Relocation in Broad Daylight! సీతంపేట ఏజెన్సీలో విలువైన అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. ఓల్టా చట్టానికి తూట్లు పొడు స్తున్నారు. పట్టపగలే కలప అక్రమ రవాణా చేస్తూ.. కోట్లు ఆర్జిస్తున్నారు. ఏజెన్సీలో పచ్చదనం కనుమరుగవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
కలప అక్రమ రవాణాపై దృష్టి సారించని అధికారులు
వాల్టా చట్టానికి తూట్లు
ఏజెన్సీలో కనుమరుగవుతున్న పచ్చదనం
స్పందించాలని గిరిజన సంఘాల విన్నపం
సీతంపేట రూరల్,మే 25(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో విలువైన అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. ఓల్టా చట్టానికి తూట్లు పొడు స్తున్నారు. పట్టపగలే కలప అక్రమ రవాణా చేస్తూ.. కోట్లు ఆర్జిస్తున్నారు. ఏజెన్సీలో పచ్చదనం కనుమరుగవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా విలువైన కలపను మారుమూల గిరిజన గ్రామాల నంచి మైదాన ప్రాంతాల్లో ప్రధాన రహదారుల మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అడిగే వారే లేకపోవడంతో కలప అక్రమ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన కొంతమంది అటవీశాఖ సిబ్బంది మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
- సీతంపేట మన్యంలో వందల ఎకరాల్లో టేకు, అక్కెషియా, గుగ్గిలం, గండ్ర తదితర రకాలకు చెందిన అటవీ సంపద ఉంది. వాటిల్లో టేకు చెట్లకు డిమాండ్ ఎక్కువ. ఈ విలువైన కలపను గిరిజన రైతుల నుంచి కొంతమంది కారుచౌకగా కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. మరికొందరు ఎటువంటి అనుమతుల్లేకుండా చెట్లను నేలకూల్చి తమ దందా కొనసాగిస్తున్నారు.
- వాస్తవంగా దోనుబాయి, పొల్ల, కడగండి, కుసిమి, కుమ్మరిగండి, గజిలి, చాకలిగూడ, పూతికవలస, చినబగ్గ, మర్రిపాడు, గొయిది, శిలగాం, మల్లి, కొత్తగూడ వంటి ప్రాంతాల్లో కలప ఎక్కువగా లభిస్తుంది. దీంతో ఆయా చోట్ల కటింగ్ మిషన్లతో పట్టపగలే టేకు చెట్లను నేలకూల్చి వాహనాల ద్వారా వాటిని తరలిస్తున్నారు. విలువైన టేకు దుంగలను పాలకొండ, సరుబుజ్జిలి, రొట్టవలస, కొత్తూరు, ఆమదాలవలస వంటి ప్రాంతాల్లోని కర్రల డిపోలకు తరలిస్తున్నారు.
- సీతంపేట ఏజెన్సీలోని ఎంతో విలువైన టేకు కలపకు మంచి డిమాండ్ ఉంది. చేవతో కూడుకున్న మూర సైజు చెక్క ఖరీదు రూ.1800 వరకు పలుకుతోంది. గృహ అవసరాలకు ఉపయోగపడే ఈ కలపను గృహ నిర్మాణదారులు ఎన్ని లక్షలు వెచ్చించైనా కొనుగోలు చేస్తారు. దీంతో మైదాన ప్రాంత కలప వ్యాపారులు సీతంపేట ఏజెన్సీనే కేంద్రంగా చేసుకొని విలువైన టేకు కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. విలువైన అటవీ సంపదను రక్షించాల్సిన అటవీశాఖ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
సబ్ డీఎఫ్‌వో ఏమన్నారంటే...
‘అటవీ సంపదను కొల్లగొట్టే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కలప అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెడతాం. దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తాం.’ అని అటవీశాఖ సబ్ డీఎఫ్‌వో సంజయ్ తెలిపారు.