Share News

సాదాబైనామాలకు మోక్షం

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:49 PM

ఇక నుంచి ఇలాంటి భూములకు మోక్షం కలగనుంది. సాదాబైనామాలు (గ్రామ పురోణి) క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

సాదాబైనామాలకు మోక్షం

- క్రమబద్ధీకరణకు ప్రభుత్వం శ్రీకారం

- మార్గదర్శకాలు జారీ

- 2027 డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలి

- 90 రోజుల్లోపు సమస్యను పరిష్కరించేలా చర్యలు

- సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం

- వేపాడ మండలం అరిగిపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు ఐదు దశాబ్దాల కిందట ఆరు ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కోనుగోలు చేశాడు. ఈ భూమి ఆ గ్రామానికి అనుకుని ఉన్న సోంపురం రెవెన్యూ పరిధిలో ఉంది. అప్పట్లో గ్రామ పెద్దల మాట ప్రకారం స్టాంప్‌ పేపరుపై గ్రామ పురోణి (సాదాబైనామా) రాసుకొని కొనుగోలుదారుడు భూమిని స్వాధీనం చేసుకుని సాగు చేసుకుంటున్నాడు. అయితే, ఈ భూ రికార్డులో ఇప్పటికీ అప్పట్లో అమ్మకం చేసిన రైతు పేరే ఉంది. దీంతో సదరు రైతు వారసులు వెబ్‌ల్యాండ్‌లో వారి పేర్లను నమోదు చేసుకున్నారు. దీనివల్ల కోనుగోలు రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు. భూమిని ఆన్‌లైన్‌ చేసుకునేందుకు ప్రయత్నించగా అమ్మిన రైతు వారసుల పేర్లు కనిపిస్తున్నాయి. వారు ఈ భూమికి తమకు ఎటువంటి సంబంధం లేదని లిఖిత పూర్వకంగా రాసిస్తేనే మీ పేరున ఆన్‌లైన్‌ చేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతుండడంతో కొనుగోలు రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

శృంగవరపుకోట, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఇక నుంచి ఇలాంటి భూములకు మోక్షం కలగనుంది. సాదాబైనామాలు (గ్రామ పురోణి) క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. వారం రోజుల కిందట ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను భూ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ జారీ చేశారు. సాదాబైనామా భూమికి ఆధారాలు లేవని, స్టాంప్‌ పేపర్‌లో రాసేటప్పుడు తప్పులు దొర్లాయని దరఖాస్తులను అధికారులు తిరస్కరించేందుకు వీలు లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024 జూన్‌ 15లోపు జరిగిన ఒప్పందాలన్నిటికీ ఈ క్రమబద్ధీకరణ వర్తించనుంది. 2027 డిసెంబరు 31వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. అయితే గ్రామాల్లోని సాగు భూములకే ఇది వర్తించనుంది. కేవలం 2.5 ఎకరాల మాగాణి, 5ఎకరాల మెట్టున్న చిన్న రైతు, 2.5 ఎకరాల మాగాణి, 2.5 ఎకాల మెట్టున్న సన్నకారు రైతులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసుకున్న రైతు స్వాధీనంలో ఈ భూమి ఉండాలి. అడంగల్‌లో అనుభవదారునిగా పేరు నమోదై ఉండాలి. లేదంటే శిస్తు రశీదులు, ఈక్రాప్‌ నమోదును పరిశీలనలోకి తీసుకుంటారు. ఈ పత్రాలేవీ లేకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు భూమిని పరిశీలించాలి. ఈ భూమి ఆ రైతు స్వాధీనంలో ఉందో లేదో చుట్టుపక్కల పొలాలు ఉన్న రైతులను విచారించి తెలుసుకోవాలి. ఆధారాలు లేవని, చుట్టుపక్కల రైతులెవరూ విచారణకు రాలేదని, వివరాలు చెప్పడం లేదని కుంటి సాకులు చెప్పేందుకు వీలు లేదు. రైతు సంతకం కాదని, దరఖాస్తుదారులు రాలేదని, చుట్టుపక్కల రైతులు అభ్యంతరం చెబుతున్నారని, రైతు పేరు, ఇంటి పేరు, గ్రామం, మండలం, ఇతర టైపింగ్‌, రాత తప్పులు ఉన్నాయని దరఖాస్తులను తిరస్కరించకూడదు. దరఖాస్తుల అందిన మూడు నెలలు లోపు పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అసలు సాగుదారులకు న్యాయం..

రెండు, మూడు దశాబ్దాల కిందట గ్రామాల్లో అత్యధికంగా సాదాబైనామాలు (గ్రామ పురోణి) ఆధారంగా భూముల కొనుగోలు, అమ్మకాలు జరిగేవి. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలోనే లావాదేవీలన్నీ జరిగేవి. పెద్దగా ఖర్చు లేకుండా క్రయ విక్రయాలు జరగడంతో దీన్నే అనుసరించేవారు. ఇలాంటి భూములకు సంబంధించి ఇప్పటికీ అప్పట్లో అమ్మకాలు చేసిన రైతులు, వారి వారసుల పేర్లే రికార్డుల్లో కనిపిస్తున్నాయి. దీని ప్రకారం 2011లో వచ్చిన వెబ్‌ ల్యాండ్‌లో రెవెన్యూ అధికారులు పేర్లు నమోదు చేసేశారు. దీంతో అసలు సాగుదారుడి పేరు భూ రికార్డుల్లో లేక ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను పొందలేకపోతున్నారు. ప్రస్తుతం భూముల ధరలు విపరీతంగా పెరగడంతో కొందరు ఇదే అదునుగా రికార్డుల్లో ఉన్న పేర్లకు అనుగుణంగా వారి వారసులతో వేరొకరికి ల్యాండ్‌ను విక్రయించేస్తున్నారు. తీరా కోనుగోలుదారుడు భూమి మీదకు వచ్చేటప్పటికి వేరొకరు సాగులో ఉండడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టడంతో ఇలాంటి వారందరికీ న్యాయం జరగనుంది.

Updated Date - Dec 12 , 2025 | 11:49 PM