Share News

Lorry Industry లారీ పరిశ్రమకు ఊరట

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:23 AM

Relief for the Lorry Industry లారీ యజమానులకు కూటమి సర్కార్‌ తీపి కబురు అందించింది. ఫిట్‌నెస్‌ చార్జీలు పెంపుదల చేయకుండా భరోసా అందించింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న లారీ పరిశ్రమకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఊరటనిచ్చినట్లయ్యింది.

 Lorry Industry  లారీ పరిశ్రమకు ఊరట
సాలూరులో లోడింగ్‌ కోసం సిద్ధంగా ఉన్న లారీలు

  • ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం

  • ఆనందంలో లారీ ఓనర్లు

సాలూరు రూరల్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): లారీ యజమానులకు కూటమి సర్కార్‌ తీపి కబురు అందించింది. ఫిట్‌నెస్‌ చార్జీలు పెంపుదల చేయకుండా భరోసా అందించింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న లారీ పరిశ్రమకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఊరటనిచ్చినట్లయ్యింది. వాస్తవంగా లారీలకు మోడల్‌ ఆధారంగా ఫిట్‌నెస్‌ , రెన్యూవల్‌ చార్జీలను కేంద్రప్రభుత్వం పెంచుతూ ఈ ఏడాది నవంబరు 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లారీ యాజమానులు ఆందోళన చెందారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల పెంపునకు బ్రేక్‌ వేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

సాలూరు లారీ పరిశ్రమ విజయవాడ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇక్కడి వారి ఉపాధికి లారీ పరిశ్రమే దిక్కు. పట్టణంలో 3 వేలు పైబడి లారీలు, ఇతర వాహనాలున్నాయి. దాపు 23 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. సాలూరు నియోజక వర్గంలో ఉన్న జీగి రాం జూట్‌ మిల్లు మూత పడిన తర్వాత పలువురు కార్మికులు కూడా లారీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే డీజిల్‌ ధర, కిరాయిలు తగ్గడం, వివిధ పన్నులు, రవాణా వ్యయం, లోడింగ్‌ లేకపోవడం తదితర కారణాలతో లారీ పరిశ్రమ కష్టాల్లో ఉంది. లారీలను నడపలేని పరిస్థితుల్లో ఓనర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో వయసు ఆధారంగా ఫిటెనెస్‌ చార్జీలు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పర్యావరణ పరిరక్షణ కోణంలో 15 ఏళ్లు దాటిన లారీకి ఏకంగా రూ. 36 వేలు వరకు ఫిట్‌నెస్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై లారీ ఓనర్లు ఆందోళన చెందారు. ఫిట్‌నెస్‌ చార్జీలు తగ్గించకుంటే లారీలను నడపలేమని వారు తేల్చి చెప్పారు. లారీ ఓనర్ల ఆందోళనను అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టారు.

ఆనందంగా ఉంది..

లారీల మోడల్‌ను బట్టి ఫిట్‌నెస్‌ చార్జీలు పెంపును కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడం ఆనందంగా ఉంది. లారీ ఓనర్లును ఆదుకున్నట్టు అయ్యింది. 15 ఏళ్లు దాటిన లారీకి రూ. 36 వేలు ఫిట్‌నెస్‌ చార్జీలు చెల్లించాలంటే ఎలా? ప్రభుత్వ తాజా నిర్ణయంతో లారీ పరిశ్రమకు ఊపిరి వచ్చింది.

- నులకల నారాయణమూర్తి, లారీ ఓనరు, సాలూరు

=============================

ప్రభుత్వ నిర్ణయంతో ఊరట

లారీలకు ఫిట్‌నెస్‌ చార్జీలను విధించకుండా కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడం హర్షణీయం. సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం.. లారీ ఓనర్లకు ఊరటనిచ్చింది. కష్టాల్లో ఉన్న లారీ పరిశ్రమకు ఊపిరి పోసినట్టు అయ్యింది.

- కెల్ల అప్పారావు, లారీ ఓనరు, సాలూరు

Updated Date - Dec 25 , 2025 | 12:23 AM