Relief for the farmer అన్నదాతకు ఊరట
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:47 PM
Relief for the farmer ఆశ, నిరాశల మధ్య ఈ ఏడాది ఖరీఫ్ పనులు చేపట్టిన అన్నదాతలకు కాస్త ఊరట లభించినట్టే. ఆగస్టులో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ పనులు శతశాతం పూర్తి చేశారు. ఈ నెల 15 నాటికి వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు సంబంధించిన పనులు 50 శాతం కూడా పూర్తికాలేదు. 20 తరువాత అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు ఖరీఫ్‌పై ఆశలు చిగురించాయి. గెడ్డలు, చెరువులతో పాటు పంట పొలాల్లో కూడా నీరు చేరింది. దీంతో రైతాంగం ఖరీఫ్ పనులు పూర్తిచేసింది.
అన్నదాతకు ఊరట
జిల్లాలో అధిక వర్షపాతం నమోదు
వరి, మొక్కజొన్న, పత్తికి మేలు
ఖరీఫ్ పనులు శతశాతం పూర్తి
విజయనగరం రూరల్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ఆశ, నిరాశల మధ్య ఈ ఏడాది ఖరీఫ్ పనులు చేపట్టిన అన్నదాతలకు కాస్త ఊరట లభించినట్టే. ఆగస్టులో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ పనులు శతశాతం పూర్తి చేశారు. ఈ నెల 15 నాటికి వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు సంబంధించిన పనులు 50 శాతం కూడా పూర్తికాలేదు. 20 తరువాత అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు ఖరీఫ్‌పై ఆశలు చిగురించాయి. గెడ్డలు, చెరువులతో పాటు పంట పొలాల్లో కూడా నీరు చేరింది. దీంతో రైతాంగం ఖరీఫ్ పనులు పూర్తిచేసింది.
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా లక్ష్యం మేర పూర్తయ్యాయి. వరి పంట 91 వేల హెక్టార్లు (2 లక్షల 35 వేల ఎకరాలు), మొక్కజొన్న 14,000 హెక్టార్లు (35 వేల ఎకరాలు), పత్తికి సంబంధించి 2,000 హెక్టార్లు (5 వేల ఎకరాల్లో) వేశారు. వరి పంట జిల్లాలోని 27 మండలాల్లో వేయగా, మొక్కజొన్న చీపురుపల్లి, రాజాం, బాడంగి, తెర్లాంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. పత్తి పంటకు సంబంధించి రాజాం, రామభద్రపురంతో పాటు పలు ప్రాంతాల్లో అధికంగా వేశారు. ఆగస్టులో అల్పపీడనం, తుఫాన్ తదితర కారణాలతో వర్షాలు విస్తృతంగా కురిశాయి. వరి పంటకు ఇబ్బంది లేకపోయినా మొక్కజొన్న, పత్తి పంటలకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉండొచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు తొలుత అభిప్రాయపడ్డారు. ఆగస్టు నెలాఖరు వరకూ కురిసిన వర్షంతో మొక్కజొన్న, పత్తికి పరవాలేదనిపించింది. వరి పంటకు మాత్రం సెప్టెంబరు నెలలో ఎంత వర్షం కురిస్తే అంత మంచిదంటున్నారు. జిల్లాలో మే, జూన్, జూలై నెలల్లో ఆరేడు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో కురిసిన వర్షాలు కారణంగా అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైంది. ఆగస్టు నెలకు సంబంధించి సాధారణ వర్షపాతం 180 మిల్లీమీటర్లు కాగా, 30న కురిసిన వర్షంతో కలిపి 264 మిల్లీమీటర్లు నమోదైంది. దీంతో జిల్లాలో 46 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టయ్యింది. శనివారం కూడా జిల్లాలోని అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
జోరు వాన
విజయనగరం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా శనివారం వాన పడింది. నగరంలో సుమారు గంటపాటు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంట్యాడ, గజపతినగరం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, భోగాపురం, దత్తిరాజేరు తదితర మండలాల్లోనూ ఓ మోస్తరు వర్షం పడింది.