Relief for employees ఉద్యోగులకు ఊరట
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:11 AM
Relief for employees ఉద్యోగులకు ప్రభుత్వం వరం ప్రకటించింది. డీఏ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నవంబరు నెలలో అందించే జీతంతో పాటు డీఏ మొత్తాన్ని జమ చేయనుంది. దీనిపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలో 22,205 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. పోలీస్ శాఖ ఉద్యోగులకు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది.
ఉద్యోగులకు ఊరట
డీఏ ప్రకటనతో భారీ ఉపశమనం
జిల్లాలో 22,205 మందికి రూ.3.10 కోట్ల లబ్ధి
150 మంది ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు
పోలీస్ శాఖలో ఆర్జిత సెలవులు
నగదుగా మార్చుకొనే అవకాశం
ఆనందం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగులకు ప్రభుత్వం వరం ప్రకటించింది. డీఏ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నవంబరు నెలలో అందించే జీతంతో పాటు డీఏ మొత్తాన్ని జమ చేయనుంది. దీనిపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలో 22,205 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. పోలీస్ శాఖ ఉద్యోగులకు ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునే అవకాశం కూడా కల్పించింది.
విజయనగరం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల సమావేశమైన విషయం తెలిసిందే. తమ సమస్యలను ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులకు వివరించారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రులు వివరించారు. అయినా సరే ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు ఉద్యోగులకు డీఏ ప్రకటించారు. పోలీస్ శాఖ ఉద్యోగులకు సంబంధించి ఎర్న్‌లీవుల అలవెన్సులు సైతం అందించనున్నట్టు చెప్పారు. నవంబరులో 50 శాతం, జనవరిలో 50 శాతం అందిస్తామని ప్రకటించారు. తాజా పరిణామంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 22,205 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ ప్రకటనతో వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో ఉద్యోగికి కనిష్టంగా రూ.1000 నుంచి రూ.3000 వరకూ లబ్ధి చేకూరనుంది. సగటున రూ.1400 వరకూ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. జిల్లాలో ఉద్యోగులకు రూ.3.10 కోట్ల మేర ఆర్థిక లబ్ధి కలగనుందన్న మాట. వాస్తవానికి ఉద్యోగులకు నాలుగు డీఏలు చెల్లించాల్సి ఉంది. జగన్ సర్కారు ఒక్క డీఏ కూడా ప్రకటించలేదు. ఇప్పుడు డీఏ విడుదల చేసిన ప్రభుత్వం.. మున్ముందు మిగతా డీఏలను సైతం విడుదల చేస్తామని ప్రకటించింది. దీంతో ఉద్యోగులు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. అయితే పీఆర్సీ ప్రకటన రాకపోవడంపై మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగ విరమణ వరకూ చైల్డ్‌కేర్ సెలవులు
సాధారణంగా మహిళా ఉద్యోగులకు సెలవులు అనేది కీలకం. కుటుంబాల్లో మహిళల ప్రసవం నుంచి పిల్లల వివాహాలు, వారి ప్రసవాలు, అనారోగ్య, అత్యవసర సమయాల్లో సెలవులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా చైల్డ్‌కేర్ సెలవులు అనేవి ఉద్యోగి సర్వీసులో 18 ఏళ్లకే ముగిసేవి. మెడికల్ లీవు కానీ.. నష్ట సెలవులు కానీ పెట్టుకోవాల్సి వచ్చేది. కాగా చైల్డ్‌కేర్ సెలవులు పెట్టుకోవడానికి ఉద్యోగ విరమణ వరకూ కూటమి ప్రభుత్వం అనుమతించింది. అదే విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇది ఉద్యోగులకు భారీ ఉపశమనమే. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల్లో 47 శాతం మంది మహిళలే ఉన్నారు. 10,436 మంది వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. చైల్డ్‌కేర్ సెలవులు సర్వీసు మొత్తం వర్తింపజేయడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం..
ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ సర్కారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందే తప్ప ఉద్యోగులకు ఒక్క ప్రయోజనం కల్పించలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగులని చెప్పి చాలా రకాల అలవెన్సులు నిలిపివేసింది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాలో 150 మంది వరకూ సీనియర్ ఉద్యోగులకు పదోన్నతులు కలగనున్నాయి. వారి కేడర్ మారుతుంది. జీతం కూడా పెరుగుతుంది.
పోలీస్ శాఖకు మరింత ఉపశమనం
సెలవులు లేని ఏకైక శాఖ పోలీస్ శాఖ. ఏడాది మొత్తం సెలవులు అనేవి స్వల్పం. అవి కూడా స్టేషన్ అధికారి అనుమతితోనే తీసుకోవాల్సి ఉంటుంది. వారాంతపు సెలవులు అనేవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అయితే తమ ఎర్న్, సరెండర్ లీవులు ఇవ్వాలని పోలీస్ శాఖ ఉద్యోగులు కోరుతూ వస్తున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. నవంబరులో 50 శాతం, జనవరిలో మిగిలిన 50 శాతం సరెండర్ లీవుల చెల్లింపులు చేయనున్నారు. జిల్లా పోలీస్ శాఖలో 2,500 మంది పనిచేస్తున్నారు. సెలవు దినాల్లో పనిచేస్తున్నందుకు సరెండర్ లీవులు మంజూరవుతాయి. ఆర్జీత సెలవులుగా భావించి నగదు రూపంలో మార్చుకోవచ్చు. ఈ లెక్కన పోలీస్ శాఖ ఉద్యోగులకు రూ.6 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని ఉద్యోగ సంఘాల నేతల అంచనా.
ఆస్తి పన్ను మినహాయింపు..
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయాలకు సంబంధించి ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో ఉద్యోగ సంఘాల భవనాలు ఉన్నాయి. విజయనగరంలో ఏపీఎన్జీవో, రెవెన్యూ పింఛనుదారుల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, సర్వే, వ్యవసాయ, విద్యుత్ శాఖలకు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. స్థానిక రెవెన్యూ అసోసియేషన్ భవనానికి ఆరు నెలలకు రూ.12,500 వరకూ పన్ను చెల్లించేవారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉపశమనం కలగనుంది.
శుభ పరిణామం..
రాష్ట్ర ప్రభుత్వం డీఏ మంజూరు చేయడం శుభ పరిణామం. ఏళ్ల తరబడి ఉద్యోగులు నాలుగు డీఏల కోసం ఎదురుచూస్తూ వచ్చారు. కనీసం రెండు డీఏలు ప్రకటిస్తామని భావించాం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఒక్క డీఏకు అంగీకరించారు. అయినా సరే కొంత ఉపశమనం.
- శ్రీధర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం
చాలా మంచి నిర్ణయం
చైల్డ్‌కేర్ సెలవులు ఉద్యోగుల పదవీ విరమణ వరకూ వర్తింపజేయడం మంచి విషయం. ఉద్యోగుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కుటుంబంలో వారి పాత్ర కీలకం. ఇటు ఉద్యోగ విధులు చూడాలి. అటు కుటుంబాన్ని చూసుకోవాలి. కుటుంబంలో ఏ ఒక్కరికీ బాగాలేకపోయినా.. అనారోగ్యానికి గురైనా సెలవు పెట్టాల్సి వస్తుంది. చైల్డ్‌కేర్ సెలవులను వినియోగించే సమయాన్ని 18 ఏళ్ల నుంచి సర్వీసు మొత్తానికి పెంచడం ఆహ్వానించదగ్గ విషయం.
- పి.రఫెల్, జిల్లా కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ అసోషియేషన్
------------------------