Water Scheme సమగ్ర నీటి పథకానికి మోక్షం
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:41 PM
Relief for Comprehensive Water Scheme సాలూరు పట్టణ వాసుల భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం నిర్మించతలపెట్టిన సమగ్ర నీటి పథకానికి మోక్షం లభించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
మళ్లీ టెండర్లు పిలివడానికి సమాయత్తం
వైసీపీ హయాంలో శంకుస్థాపనకే పరిమితం
సాలూరు రూరల్, జూన్ 7(ఆంధ్రజ్యోతి ): సాలూరు పట్టణ వాసుల భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం నిర్మించతలపెట్టిన సమగ్ర నీటి పథకానికి మోక్షం లభించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. వాస్తవంగా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ( ఏఐఐబీ ) నిధులు రూ. 68.98 కోట్లతో పెద్దగెడ్డ ప్రాజెక్ట్ నుంచి సాలూరుకు తాగునీరు తేవాలని అప్పట్లో సంకల్పించారు. ఈ మేరకు 2022, సెప్టెంబరు 10న అప్పటి డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరులో పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ పైపులు సైతం తెచ్చారు. అయితే ఏ కారణం చేతో పనులు ప్రారంభం కాలేదు. కాంట్రాక్టర్ కాలవ్యవధి పూర్తి కావడంతో తెచ్చిన పైపులు తీసుకెళ్లిపోయారు. ఈ బ్యాంక్ నిధులతో పార్వతీపురం, పాలకొండలో సైతం అంతంత మాత్రంగానే పనులు జరిగాయి. అయితే ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం పనులు చేపట్టే దిశగా చర్యలు చేపట్టింది. ఏఐఐబీ పనుల కాల వ్యవధిని 2028, మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో పార్వతీపురం, పాలకొండ, సాలూరు పట్టణవాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు లైన్ క్లియరైంది. కాగా సాలూరులో నాలుగు ట్యాంక్‌ల ద్వారా ప్రస్తుతం తాగునీరు సరఫరా చేస్తున్నారు. మున్సిపాల్టీలో 3620 ప్రైవేట్ కుళాయిలు, 125 పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి. రోజుకు 7 ఎంఎల్‌డీ అవసర ముండగా రోజువారీగా 3.5 ఎంఎల్‌డీ మాత్రమే సరఫరా చేస్తున్నారు. బంగారమ్మపేట, పీఎన్‌బొడ్డవలస, శ్రీనివాసనగర్ కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఇబ్బందులున్నాయి. సమగ్ర నీటి పథకం పూర్తి చేస్తే పట్టణవాసులకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా కానుంది. శివారు ప్రాంతవాసుల కష్టాలు కూడా తీరనున్నాయి. కాగా ఈ పనుల కోసం మళ్లీ టెండర్లు పిలవడానికి పాలకవర్గం సమాయత్తమవుతుంది.
టెండర్లు పిలుస్తాం
ఏఐఐబీ నిధులతో సమగ్ర నీటి పథకం పనులకు మళ్లీ టెండర్లు పిలవనున్నాం. పాత కాంట్రాక్టర్ పనులు చేయకుండా వెళ్లిపోయారు. అందువల్ల మళ్లీ టెండర్లు పిలిచి నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేయిస్తాం. అంచనా వ్యయం పెరగడంతో సుమారు రూ.90 కోట్లతో ప్రభుత్వానికి మళ్లీ నివేదికలు పంపించాం.
- బీవీ ప్రసాద్, మున్సిపల్ డీఈ, సాలూరు