Relax with nano నానోతో ఊరట
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:39 PM
Relax with nano జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు చాలా ప్రయాస పడుతున్నారు. కొద్దిరోజులుగా గంటలు, రోజులు నిరీక్షిస్తున్నారు. రైతులకు ఈ బాధ తప్పించేందుకు ప్రభుత్వం ద్రవరూపంలో ‘నానో’ యూరియాను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరతో పాటు సులభంగా రవాణా చేసుకునేందుకు వీలుంది. రసాయన మందులు మాదిరిగా పిచికారీ చేసుకుంటే చాలని అధికారులు చెబుతున్నారు. ఇదో సులభతరమైన ఎరువు అని కూడా అంటున్నారు.
నానోతో ఊరట
జిల్లాలో అందుబాటులోకి కొత్త తరహా ఎరువులు
ద్రవరూపం యూరియా, డీఏపీ మేలంటున్న శాస్త్రవేత్తలు
సాధారణ ఎరువు కంటే ధర తక్కువ
సమయం, శ్రమ ఆదా అంటున్న అధికారులు
జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు చాలా ప్రయాస పడుతున్నారు. కొద్దిరోజులుగా గంటలు, రోజులు నిరీక్షిస్తున్నారు. రైతులకు ఈ బాధ తప్పించేందుకు ప్రభుత్వం ద్రవరూపంలో ‘నానో’ యూరియాను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధరతో పాటు సులభంగా రవాణా చేసుకునేందుకు వీలుంది. రసాయన మందులు మాదిరిగా పిచికారీ చేసుకుంటే చాలని అధికారులు చెబుతున్నారు. ఇదో సులభతరమైన ఎరువు అని కూడా అంటున్నారు.
- వంగర మండలం కొప్పర కొత్తవలసకు చెందిన రైతు అప్పలనాయుడు ఎరువుల కోసం ఎదురుచూశాడు. తాను వేసుకున్న వరి పొలానికి తగ్గట్టు యూరియా దొరకలేదు. దీంతో ఓ అధికారిని సంప్రదించాడు. ఆయన సూచనతో నానో యూరియా వేశాడు. ఈ ఎరువు పనిచేస్తుందో? లేదో? అన్న అనుమానంతో కొద్దిరోజులు గడిపాడు. నేడు వరిపైరు ఏపుగా పెరగడంతో టెన్షన్ పోయిందంటున్నాడు.
రాజాం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రైతులు ఎక్కువగా యూరియా, డీఏపీ బస్తాలను కొనుగోలు చేసి పొలాల్లో చల్లుతుంటారు. జిల్లాలో మెట్ట ప్రాంతాలతో పాటు కొండ ప్రదేశాలూ అధికం. దీంతో ఎరువుల బస్తాను అక్కడకు తీసుకెళ్లేందుకు సరైన రవాణా సదుపాయం ఉండదు. రైతులే అతి కష్టమ్మీద తరలించాల్సి ఉంటుంది.పైగా యూరియా ధర కూడా అధికమే. సమయానికి నీటి తడులు అందకపోయినా, నీరు ఎక్కువ అయినా ఎరువు వృథా కావడం ఖాయం. ఈ స్థితి నుంచి ఉపశమనం పొందాలంటే నానో యూరియా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం బస్తా యూరియా ధర రూ.266. అదే బ్లాక్ మార్కెట్‌లో అయితే రూ.350 పైమాటే. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రూ.500కుపైగా అమ్ముతున్నారు. మరోవైపు రైతుభరోసా కేంద్రాల నుంచి ఇంటికి తెచ్చేందుకు రూ.50 నుంచి రూ.100 ఖర్చవుతోంది. అదే నానో యూరియా అయితే 500 మిల్లీలీటర్ల సీసా రూ.225కే లభిస్తోంది. అదే సాధారణ డీఏపీ బస్తా రూ.1350. నానో డీఏపీ సీసా రూ.600కే లభిస్తుంది. బస్తాను మోయాల్సిన పని ఉండదు. సీసాలతో ఎరువును తరలించేయవచ్చు. డబ్బాను ఎక్కడికైనా తీసుకుపోవవచ్చు. ఎరువు నేలపై చల్లితే మొక్కకు పూర్తిస్థాయి అందుతుందో? లేదో? తెలియదు. అదే 500 మిల్లీలీటర్ల ద్రావణం ఎకరాకు సరిపోతుంది. రెండుసార్లు పిచికారీ చేస్తే చాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతులు ప్రయోగాత్మకంగా నానో యూరియాను వినియోగించారు. సాధారణ యూరియా కంటే బాగుంటుందని..ముఖ్యంగా తెగుళ్లు లేకుండా పోయాయంటున్నారు. పైగా చేతితో పాటు డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం సులువు అంటున్నారు. ముఖ్యంగా అగ్గి తెగులు, పొడ తెగులు రావడం లేదని రైతులు చెబుతున్నారు. సాధారణ యూరియా వేసిన తరువాత పంట నేలవారుతోందని.. నానో వేయడం వల్ల నిటారుగా నిలబడుతుందని ఈ ఎరువును ప్రయోగించిన రైతులు చెబుతుండడం విశేషం. వరి నాటిన 30 రోజుల తరువాత నానో యూరియా వాడితే ఫలితముంటుందంటున్నారు. అయితే నానో యూరియా ప్రభావం ఆలస్యంగా చూపుతుందని చెబుతున్నారు. దీనిపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.
ఎన్నో ప్రయోజనాలు
నానో ఎరువులతో ఎన్నోరకాల ప్రయోజనాలున్నాయి. ద్రవ పదార్థాల్లో ఉండే ఎరువు వినియోగం చాలా సులువు. ధర కూడా తక్కువ. నిపుణులు కూడా నానో ఎరువు శ్రేయస్కరమని చెబుతున్నారు. ద్రవ పదార్థంతో కూడిన ఎరువు నిత్యం అందుబాటులో ఉంటుంది కూడా. రాయితీపైనా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
- సీహెచ్ రఘునాథ్, మండల వ్యవసాయ అధికారి, రాజాం
-------------------------------