చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:15 AM
ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేశారు.
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి
- సాయంత్రంమైతే చాలు డాక్యుమెంట్ రైటర్లు, దళారులు రంగప్రవేశం
-ఇప్పటికే చేతులు మారిన ఫ్రీహోల్డ్ భూములు
-తాజాగా భోగాపురం కార్యాలయంలో ఏసీబీ సోదాలు
విజయనగరం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేశారు. ఇందులో జిల్లాలోని భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా ఉండడంతో కలకలం రేగింది. జిల్లాలో 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే, దాదాపు అన్ని కార్యాలయాల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం 6 దాటిన తరువాత డాక్యుమెంట్ రైటర్లు, దళారులు రంగప్రవేశం చేసి తమ పని కానిచ్చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. చేయి తడిపితే చాలు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని కార్యాలయాల్లో అనధికార వ్యక్తులదే హవా. సిబ్బంది మాదిరిగా వ్యవహరిస్తుంటారు. క్రయ విక్రయదారులకు కార్యాలయంలోకి రాకుండా కట్టడి చేస్తుంటారు. కానీ, కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఇట్టే ప్రవేశిస్తుంటారు. ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. తనిఖీల సమయంలో వీరు జాగ్రత్తపడడం, తరువాత తమ పని మొదలు పెట్టడం షరా మూమ్మూలుగానే కొనసాగుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కోట్లాది రూపాయలను కలెక్షన్ల రూపంలో కొల్లగొడుతున్నారు.
అక్రమంగా భూబదలాయింపు..
గత వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణంతో అప్పటి ప్రభుత్వ పెద్దల కన్ను జిల్లాపై పడింది. జిల్లాలో పెద్ద ఎత్తున డీ పట్టా భూమి ఉంది. గతంలో ప్రభుత్వాలు పంపిణీ చేసిన డీ పట్టాలకు సంబంధించి 20 సంవత్సరాలు పూర్తయిన వాటికి ఆ భూములపై పట్టాదారులకు పూర్తి హక్కులు కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవో ప్రకారం ఉమ్మడి జిల్లాలో అర్హత సాధించిన పట్టాదారు భూములు 21 వేల ఎకరాలు ఉన్నాయి. తొలి విడతలో 11,025 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసేందుకు అనుమతి వచ్చింది. అయితే ప్రభుత్వ జీవో వస్తుందని తెలిసి అప్పట్లో కొందరు వైసీపీ పెద్దలు ముందుగానే ప్లాన్ చేశారు. ఒక పథకం ప్రకారం డీపట్టాల యజమానులకు కొంతమొత్తం అందించి ఒప్పంద పత్రం రాయించుకున్నారు. ఆ భూములను వారి పేరిట బదలాయించుకున్నారు. దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీహోల్డ్ రిజిస్ర్టేషన్ ప్రక్రియను నిలిపివేసింది.
కొన్ని నెలల కిందట శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిషేధిత భూములు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఎస్.కోట కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని కొందరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఎస్.కోట, భోగాపురం, గజపతినగరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించారు. వివాదాస్పద భూములను పరిశీలించారు. భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. అందులో భాగంగా ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు.
జిల్లాలోనే ఎక్కువ..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోనే ఫ్రీహోల్డ్ భూములు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూతో పాటు రిజిస్ర్టేషన్ల శాఖ అధికారులు, సిబ్బంది పాత్ర ఉంది. ముఖ్యంగా విశాఖ జిల్లా సరిహద్దు మండలాలైన ఎస్.కోట, కొత్తవలస భూములపై కొందరు వైసీపీ నేతలు కన్నేశారు. ఈ మండలాల్లో భూముల ధరలు భారీగా ఉన్నాయి. భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణం నేపథ్యంలో అక్కడి భూముల ధరలు భారీగా పెరిగాయి. ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని ముందే తెలుసుకున్న అప్పటి కొంతమంది వైసీపీ నేతలు ఎక్కడికక్కడే డీపట్టాదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరా రూ.2కోట్లు ధర ఉన్న చోట రూ.25 లక్షలు అందించి ఒప్పంద పత్రం రాయించుకున్నారు. జిల్లాలో అత్యధికంగా ఎస్.కోటలో 98.32 ఎకరాలు, భోగాపురంలో 41 ఎకరాలు, గజపతినగరంలో 39.99 ఎకరాలు, విజయనగరంలో 10.38 ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ అయినట్టు సమాచారం. ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఇకనైనా కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, వసూలు దందా నియంత్రణలోకి వస్తుందో? లేదో? చూడాలి.
బోసిపోయిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
భోగాపురం, నవంబరు7(ఆంధ్రజ్యోతి): గత రెండు రోజులుగా ఏసీబీ సోదాలు కారణంగా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. పరిసర ప్రాంతాల్లో దస్తావేజు లేఖర్లు కూడా కనిపించడం లేదు. దీంతో నిత్యం క్రయవిక్రయదారులతో కళకళలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శుక్రవారం బోసిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగింది. దీనిపై సబ్‌రిజిస్ట్రార్ పి.రామకృష్ణను వివరణ కోరగా.. ‘రిజిస్ట్రేషన్లు ఎప్పటిలాగే చేస్తాం. అనివార్య కారణాలతో శుక్రవారం ఉదయం ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదు. మధ్యాహ్నం ఒక రిజిస్ట్రేషన్ చేశాం.’అని తెలిపారు.
నిఘా కొనసాగుతోంది..
జిల్లాలో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలపై నిఘా కొనసాగుతోంది. పర్యవేక్షణ సైతం చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ర్టేషన్లు చేసినా.. అక్రమ వసూళ్లు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు.క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిజిస్ర్టేషన్లు చేయాలి.
-టి. ఉపేంద్రరావు.. జిల్లా రిజిస్ర్టార్, విజయనగరం