Reduced interest in bars! బార్లపై తగ్గిన ఆసక్తి!
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:34 AM
Reduced interest in bars! జిల్లాలో బార్ల నిర్వహణపై ఆసక్తి అంతంతమాత్రంగా కనిపిస్తోంది. దరఖాస్తు చేసుకునేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. జిల్లాలో 28 బార్లకుగాను కేవలం 42 మంది మాత్రమే రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. అందులో ఇద్దరు మాత్రమే నగదు చెల్లింపులు చేశారు.
బార్లపై తగ్గిన ఆసక్తి!
28 బార్లకు 42 మంది మాత్రమే రిజిస్ర్టేషన్
నాలుగు దరఖాస్తుల నిబంధనే కారణమా?
మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లూ అడ్డంకే
నేటి సాయంత్రంతో ముగియనున్న గడువు
విజయనగరం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో బార్ల నిర్వహణపై ఆసక్తి అంతంతమాత్రంగా కనిపిస్తోంది. దరఖాస్తు చేసుకునేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. జిల్లాలో 28 బార్లకుగాను కేవలం 42 మంది మాత్రమే రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. అందులో ఇద్దరు మాత్రమే నగదు చెల్లింపులు చేశారు. కొద్దిరోజుల కిందట ఏపీ ప్రభుత్వం బార్ పాలసీని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 800కుపైగా బార్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. అందులో భాగంగా జిల్లాలో 28 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 26లోగా దరఖాస్తులు స్వీకరించి డిపాజిట్లు సైతం చెల్లించాలని చెప్పింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బార్ పాలసీ ఉంది. మద్యం దుకాణాల మాదిరిగానే లాటరీ తీస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టింది. ఒక్కో బారుకు 4 దరఖాస్తులు ఉంటేనే లాటరీ తీస్తామని చెప్పడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. దరఖాస్తు రుసుం కింద సుమారు రూ.5.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. అయితే ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా..నాలుగు దరఖాస్తులు రాకపోతే..లాటరీ తీయకపోగా రూ.5.10 లక్షలు తిరిగి ఇవ్వరట. ఈ కారణంగానే ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. ఏడాదికి రూ.55 లక్షలవరకూ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అంటే దానికి మించి ఆదాయం వస్తే కదా బార్లు నడిపేది. అందుకే మద్యం దుకాణాల్లో ఎదురైన పరిణామాల దృష్ట్యా ఎక్కువ మంది విముఖత చూపుతున్నారని తెలిసింది. ఆ వ్యాపారంలో అనుభవం ఉన్నవారు సైతం చేతులు కాల్చుకుంటామా? అంటూ ఎదురుప్రశ్న వేస్తున్నారు.
- ఎడిషనల్ రిటైల్ ఎక్ష్సైజ్ ట్యాక్స్, నాన్ రిఫండబుల్ నగదు, పర్మిట్ రూమ్‌లు, విధిగా నాలుగు దరఖాస్తులు ఉండాలన్న నిబంధనతో ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. అందుకే బార్ పాలసీ విషయంలో ప్రభుత్వం పున:సమీక్షించుకోవాలని.. 2014 నుంచి 2019 మధ్య ఉన్న బారు పాలసీని పునరుద్ధరించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
నేటితో ముగియనున్న గడువు
జిల్లాలో 28 బార్లకుగాను మంగళవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. సోమవారం సాయంత్రం నాటికి 42 రిజిస్ర్టేషన్లు అయ్యాయి. ఇద్దరు మాత్రమే డబ్బులు చెల్లించారు. మంగళవారం చివరి రోజు కావడంతో రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు మొత్తాన్ని చెల్లించే అవకాశం వుంది. కొత్తవారు సైతం రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాటరీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.
-శ్రీనాథుడు, జిల్లా ఎక్పైజ్ అధికారి, విజయనగరం
===============