Share News

Recovery Phones 206 ఫోన్ల రికవరీ

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:13 PM

Recovery of 206 Phones పోగొట్టుకున్న, చోరీ అయిన 206 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ‘మొబైల్‌ రికవరీ మేళా’ నిర్వహించారు.

 Recovery  Phones 206 ఫోన్ల రికవరీ
బాధితుడికి ఫోన్‌ అందజేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

బెలగాం, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పోగొట్టుకున్న, చోరీ అయిన 206 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ‘మొబైల్‌ రికవరీ మేళా’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో సమాచారం చేరవేయడానికి, వినోదం, విజ్ఞానానికి, ఇతర అత్యవసర సమయాల్లో స్మార్ట్‌ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రజలు తమ ఫోన్లు పోగొట్టుకోవడం లేదా అపహరణకు గురైతే.. వాటిల్లో ఉండే వ్యక్తిగత, బ్యాంక్‌, ఇతర వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం మొబైల్‌ మిస్సింగ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ సీఈఐఆర్‌ (డబ్ల్యూడబ్ల్యూ.సీఈఐఆర్‌.జీవోవీ.ఇన్‌)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఫోన్‌ వివరాలు నమోదు చేయాలి. ఈ విధంగా ఫిర్యాదు చేస్తే.. ఐఎంఈఐ నెంబర్‌ ద్వారా ట్రాకింగ్‌ చేసి మొబైల్స్‌ను రికవరీ చేసే అవకాశం ఉంటుంది. దొరికిన లేదా రశీదులు లేని మొబైల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొనడం మంచిది కాదు.’ అని తెలిపారు. ఎవరికైనా మొబైల్‌ దొరికితే వాటిని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ల్లో అందజేయాలని సూచించారు. గత ఆరు నెలల్లో జిల్లాలో పోయిన సుమారు రూ.42 లక్షల విలువ గల 206 మొబైల్స్‌ రికవరీ చేసి సంబంధిత బాధితులకు అందజేశామని వెల్లడించారు.

స్టేషన్ల వారీగా ఇలా..

బలిజిపేట-1, దోనుబాయి-6, ఎల్విన్‌ పేట-02, కురుపాం-4, పాచిపెంట-6, పాలకొండ-90, పార్వతీపురం రూరల్‌-5, పార్వతీపురం టౌన్‌-5, సీతానగరం- 8, నీలకంఠాపురం- 7, వీరఘట్టం-10, జియ్యమ్మవలస-3, చినమేరంగి-3, కొమరాడ-2, గరుగుబిల్లి-3, సాలూరు టౌన్‌-7, సాలూరు రూరల్‌-1, మక్కువ-1, బత్తిలి-1, సీతంపేటలో 17 చొప్పున మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఎస్పీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐలు, సోషల్‌ మీడియా, సైబర్‌ సెల్‌ ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2025 | 11:13 PM