Share News

recovery is bad రిక‘వర్రీ’

ABN , Publish Date - May 04 , 2025 | 12:02 AM

recovery is bad రుణాలు ఆ బ్యాంకుకు గుదిబండగా మారాయి. మొండి బకాయిలు వసూలు కాకపోవడంతో బ్యాంకు రేటింగ్‌ తగ్గుతోంది. వైసీపీ ప్రభుత్వ కాలంలో అప్పటి ప్రజాప్రతినిధులు అధికంగా బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఆ రుణాలకు సంబంధించిన వాయిదాలు మాత్రం సకాలంలో చెల్లించడం లేదు.

recovery is bad రిక‘వర్రీ’
డీసీసీబీ బ్యాంక్‌ విజయనగరం

రిక‘వర్రీ’

గుదిబండగా డీసీసీబీ రుణాలు

ఐదేళ్ల కాలంలో వాడుకున్న ప్రజాప్రతినిధులు

చెల్లింపుల్లో మాత్రం జాప్యం

మొండి బకాయిలు రూ.47 కోట్లు

వసూలు చేయలేక అధికారులకు తలనొప్పులు

విజయనగరం, మే3 (ఆంధ్రజ్యోతి):

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రుణాలు ఆ బ్యాంకుకు గుదిబండగా మారాయి. మొండి బకాయిలు వసూలు కాకపోవడంతో బ్యాంకు రేటింగ్‌ తగ్గుతోంది. వైసీపీ ప్రభుత్వ కాలంలో అప్పటి ప్రజాప్రతినిధులు అధికంగా బ్యాంకు నుంచి రుణాలు పొందారు. ఆ రుణాలకు సంబంధించిన వాయిదాలు మాత్రం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో బకాయిలు పెరుగుతూ వస్తున్నాయి. వసూలుకు అధికారులు చర్యలు చేపడుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు కన్పించడం లేదు. ఐదేళ్ల కాలంలో రుణాలు పొందిన వారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులే ఉన్నారు. రైతులు, చిన్న, చిన్న రుణాలు తీసుకున్న వారి నుంచి రికవరీ బాగానే ఉన్నా.. రూ.లక్షలు రూ.కోట్లలో రుణాలు తీసుకున్నవారి నుంచి వసూలు కావడం లేదు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో 2025 మార్చి నాటికి రూ.2116 కోట్ల వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయి. డీసీసీబీ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని 94 వ్యవసాయ పరపతి సంఘాలు, 24 డీసీసీబీ శాఖలు, 9 ఏటీఎంలు, 3 మొబైల్‌ ఏటీఎంలు ఉన్నాయి. కోటీ 30 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రైతులే. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, దాని అనుబంధ శాఖల నుంచి దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు మంజూరు చేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఎస్‌ఏఓ కింద రూ.440 కోట్ల 42 లక్షలు, స్వల్పకాలిక రుణాలు కింద రూ.888 కోట్ల 94 లక్షలు, దీర్షకాలిక రుణాలు కింద రూ.108 కోట్ల 05 లక్షలు ఇచ్చారు. ఈ రుణాల వసూలుకు సంబంధించి రికవరీ అంతంతమాత్రంగా ఉంది.

మొండి బకాయిలు రూ.47 కోట్లు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రూ.72 కోట్ల మొండి బకాయిలు ఉండేవి. ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.25 కోట్లను బ్యాంకు అధికారులు వసూలు చేశారు. మిగతా బకాయిలు అదే విధంగా కొనసాగుతున్నాయి. నిరుపేద, పేదలకు టిడ్కో ఇళ్లకు రూ.14 కోట్లను డీసీసీబీ అందజేసింది. ఈ రుణాల రికవరీ పూర్తిస్థాయిలో జరగడం లేదు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందకపోవడం వల్ల వారు వాయిదాలు చెల్లించడం లేదన్న అభిప్రాయం ఉంది.

చట్టపరంగా చర్యలు

సీహెచ్‌ ఉమామహేశ్వరరావు, డీసీసీబీ సీఈవో

మొండి బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. టాప్‌-10 జాబితాను సిద్ధం చేసి ముందుకు సాగుతాం. రుణాలు తీసుకున్నవారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదు. నిర్ణీత సమయంలోగా నెలవారీ వాయిదాలు చెల్లించకపోతే వారిపై చట్ట పరంగా చర్యలు చేపడతాం. 2026 మార్చి నాటికి మొండి బకాయిల్లో కనీసం 70 నుంచి 80 శాతం వసూలు చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.

లెక్క తేలుస్తాం

కిమిడి నాగార్జున, చైర్మన్‌, డీసీసీబీ

అనేక ఏళ్లనుంచి కొంతమంది నాయకుల చేతుల్లోనే పాలకవర్గం ఉంది. బ్యాంక్‌ను ఓ రాజకీయ వేదికగా మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఖాతాదారుల్లో నమ్మకాన్ని పెంచుతాం. బకాయిల వసూళ్లపై దృష్టి సారించాం. అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తెలితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు.

Updated Date - May 04 , 2025 | 12:02 AM