Share News

recovery.. రికవరీ.. ఏదీ పురోగతి?

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:57 PM

recovery.. But Where's the Progress? సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఎస్సీ, ఎస్టీ మహిళా సభ్యులకు అప్పట్లో ఇచ్చిన ఉన్నతి రుణాలపై పర్యవేక్షణ కొరవడింది. ఏళ్లు గడుస్తున్నా రికవరీలో పురోగతి కనిపించడం లేదు. ఆ రుణాల ద్వారా మహిళలు ఎంత వరకు లాభం పొందారు? ఆర్థిక ప్రయోజనాలు పొందారా? లేదా, ఎంతవరకు తిరిగి చెల్లిస్తున్నారనే అంశాలపై సంబంధిత శాఖ దృష్టి సారించడం లేదు. దీంతో ఉన్నతి రుణాల రికవరీ జరగడం లేదనే ఆరోపణలు వినిపి స్తున్నాయి.

recovery..  రికవరీ.. ఏదీ పురోగతి?
సీతంపేట ఐటీడీఏలోని వెలుగు కార్యాలయం

  • ఏళ్లు గడుస్తున్నా.. అంతంతమాత్రంగానే వసూళ్లు

  • పట్టించుకోని క్షేత్రస్థాయి సిబ్బంది

  • ఉన్నతాధికారులు దృష్టి సారించాలని విన్నపం

సీతంపేట రూరల్‌, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఎస్సీ, ఎస్టీ మహిళా సభ్యులకు అప్పట్లో ఇచ్చిన ఉన్నతి రుణాలపై పర్యవేక్షణ కొరవడింది. ఏళ్లు గడుస్తున్నా రికవరీలో పురోగతి కనిపించడం లేదు. ఆ రుణాల ద్వారా మహిళలు ఎంత వరకు లాభం పొందారు? ఆర్థిక ప్రయోజనాలు పొందారా? లేదా, ఎంతవరకు తిరిగి చెల్లిస్తున్నారనే అంశాలపై సంబంధిత శాఖ దృష్టి సారించడం లేదు. దీంతో ఉన్నతి రుణాల రికవరీ జరగడం లేదనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. వాస్తవంగా రూ.కోట్లలో రుణాలు తీసుకున్న మహిళా సంఘాల సభ్యులు ఇంతవరకు చెల్లించకుండా ఉంటారా?అనే అనుమానాలు కూడా లేకపోలేదు. రికవరీ ఎందుకు జరగడం లేదో నిగ్గుతేల్చాలంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సి ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగించే దిశగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2011-12లో ఉన్నతి రుణాలను పెద్ద ఎత్తున మంజూరు చేసింది. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఏడు టీపీఎంయూ మండలాల్లో సున్నా వడ్డీ(ఉన్నతి) రుణాలు అందజేశారు. మొత్తంగా 3,047 మంది ఎస్సీ,ఎస్టీ మహిళలకు సుమారు రూ.12.46కోట్లు రుణాలు వెలుగు సంస్థ ద్వారా ఇచ్చారు. అయితే ఈ రుణాలు మహిళా సంఘాల సభ్యులకు అందజేసి నేటికి 13ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా సుమారు రూ.8 కోట్లు పైబడి రికవరీ కావల్సి ఉంది. ప్రభుత్వాలు మారినా, ఐకేపీ(ఇందిరా క్రాంతి పధం)లో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది మారినా రికవరీలో మాత్రం పురోగతి కనిపించడం లేదు.

టీపీఎంయూ మండలాల్లో ఇలా..

- ఐటీడీఏ పరిధిలోని గిరిజన, షెడ్యూల్డ్‌ కులాలు ఎక్కువగా నివసించే సీతంపేట, కొత్తూరు, భామిని, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, మందస టీపీఎంయూ(ట్రైబల్‌ ప్రాజెక్ట్‌ మోన టరింగ్‌ యూనిట్‌)మండలాల్లో అప్పట్లో సున్నావడ్డీ కింద అధికమొత్తంలో రుణాలు మంజూరు చేశారు.

- సీతంపేట మండలంలో 1091 మంది సభ్యులకు రూ.4.1 కోట్లు, హిరమండలంలో 171మందికి రూ.74లక్షలు, కొత్తూరులో 447మందికి రూ.1.92కోట్లు, మందసలో 401మందికి 1.66కోట్లు, మెళియాపుట్టిలో 262మందికి రూ.1.13కోట్లు, పాతపట్నంలో 166మందికి 64.45లక్షలు, భామినిలో 609మందికి 2.27కోట్లు ఉన్నతి రుణాలను మంజూరు చేశారు. ఎస్సీ,ఎస్టీ మహిళలకు కోట్లలో ఉన్నతి రుణాలు అందజేసినప్పటికీ రికవరీ మాత్రం అంతంత మాత్రంగా ఉండడం వెనుక గల ఆంతర్యమేంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ విషయంలో సంబంధిత శాఖ సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

- ఉన్నతి రుణాలు తీసుకున్న సభ్యులు మూడేళ్ల కాలంలో చెల్లించకపోతే నూటికి రూ.25పైసలు వడ్డీతో వసూళ్లు చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మొండి బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్‌(ఓటీఎస్‌)పద్ధతిలో వసూళ్లకు సంబంధిత వెలుగు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

రికవరీ ఇలా..

2025, ఏప్రిల్‌ నాటికి ఉన్న నివేదికల ఆధారంగా ఉన్నతి రుణాల రికవరీ పరిశీలిస్తే .. టీపీఎంయూ మండలాల్లో సీతంపేట 1.65శాతం, హిరమండలం 51, కొత్తూరు 1.66, మందస 3.81, మెళియాపుట్టి 7.45, పాతపట్నం 21, భామిని 0.76 శాతంగా ఉంది. ఎన్నేళ్లయినా ఈ రికవరీ శాతం మాత్రం పెరగకపోవడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ రుణాలు తీసుకున్న సంఘాల సభ్యులు చెల్లిస్తున్నారా? లేదా?... చెల్లిస్తే ఏళ్లు గడుస్తున్నా.. రికవరీలో పురోగతి ఎందుకు కనిపించడం లేదు? రుణాలు ఏమైనా పక్కదారి పట్టాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

‘ఉన్నతి’ బాటలోనే..

ఐటీడీఏ పరిధిలోని ఏడు టీపీఎంయూ మండలాల్లో స్ర్తీనిధి రుణాల రికవరీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో సీతంపేట మండలంలోని 231 స్వయంశక్తి మహిళా సంఘాలకు రూ.24లక్షల వరకు రూపాయి వడ్డీ రుణాలను అందజేశారు. అయితే నేటికి ఇంకా రూ.10లక్షల వరకు రుణ బకాయిలు ఉన్నాయి. ఈవిధంగానే మిగిలిన మండలాల్లో కూడా స్ర్తీనిధి రుణాల బకాయిల ఔట్‌స్టాండింగ్‌ ఎక్కువగా ఉన్నట్లు బోగట్టా. సంఘాల నుంచి రికవరీ చేయడంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు

నిబంధనల ప్రకారం రుణాలు తీసుకున్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు ప్రతినెలా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలి. ఇటువంటి సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్‌లు కూడా ముందుకొస్తాయి. కానీ ఈ ఏడు మండలాల్లో ఉన్నతి, స్ర్తీనిధి రుణాల రికవరీ పూర్తిగా మందకోడిగా జరుగుతుండడంతో బ్యాంక్‌లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో గత రెండేళ్లుగా ఈ ప్రాంతంలో ఎవరికీ రుణాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.

ఏపీడీ ఏమన్నారంటే..

‘ఐటీడీఏ పరిధిలోని ఏడు టీపీఎంయూ మండలాల్లో గతంలో ఇచ్చిన ఉన్నతి రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టిసారించాం. స్ర్తీనిధి రుణాల రికవరీ కూడా జరుగుతుంది. రుణాల రికవరీపై ప్రత్యేక డ్రైవ్‌ చేపడతాం.’ అని వెలుగు ఇన్‌చార్జి ఏపీడీ సన్యాసిరావు తెలిపారు.

Updated Date - Aug 05 , 2025 | 11:57 PM